యాదగిరిగుట్ట భూములపై టెంపుల్‌‌‌‌ కే సర్వ హక్కులు : సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట భూములపై టెంపుల్‌‌‌‌ కే సర్వ హక్కులు : సీఎం రేవంత్ రెడ్డి

 

  • తిరుమల తరహా విధానాల అమలు.. టీటీడీ మోడల్‌‌‌‌లోనే గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌ల నిర్మాణం
  • పీపీపీ పద్ధతిలో గుట్ట టూరిజం సర్క్యూట్ 
  • ఇంజనీర్ల కమిటీ నివేదికను వారం రోజుల్లో ఫైనల్ చేయండి 
  • ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్టలో భూముల యాజమాన్య హక్కులు పూర్తిగా ఆలయం వద్దే ఉంచాలని.. మఠాలు, కుల సంఘాలకు స్థలాల కేటాయింపులపై తిరుమల తరహా విధానాన్ని అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్‌‌‌‌డీ బోధి పెవిలియన్‌‌‌‌లో యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గుట్టపై హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌‌‌‌కు మార్కెట్ రేటు ప్రకారమే భూమి ఇవ్వాలని, దాతల సహకారంతో విడతల వారీగా గెస్ట్ హౌస్‌‌‌‌ల నిర్మాణానికి అనుమతులివ్వాలని స్పష్టం చేశారు.

ఆలయ భూసేకరణకు తక్షణమే నిధులు మంజూరు చేయడంతో పాటు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో టూరిజం సర్క్యూట్‌‌‌‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ నిర్మాణంపై ఇంజనీర్ల కమిటీ నివేదికను అధ్యయనం చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. యాదగిరిగుట్టలో భూ కేటాయింపులపై ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్పష్టమైన నిబంధనలతో నూతన విధానాన్ని రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ మఠాలకు, కుల సంఘాలకు స్థలాలు ఇచ్చే అంశంపై టీటీడీ అనుసరిస్తున్న నిబంధనలను అధ్యయనం చేయాలన్నారు.

అలాగే, గుట్టపై గెస్ట్ హౌస్‌‌‌‌ల నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. తిరుమల తరహాలోనే ఇక్కడా విడతల వారీగా కాటేజీల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం నిర్ణయించారు. సమావేశంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు స్పెషల్ సీఎస్​ జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎం. హనుమంతరావు పాల్గొన్నారు.