సింగూరు పనులు వెరీ స్లో...గతేడాది రాతికట్ట 600 మీటర్లు డ్యామేజ్

సింగూరు పనులు వెరీ స్లో...గతేడాది రాతికట్ట 600 మీటర్లు డ్యామేజ్
  •     రివిట్మెంట్ పనుల కోసం ప్రాజెక్టు ఖాళీ
  •     29.917 టీఎంసీలకు గానూ 8 టీఎంసీలే కొనసాగింపు
  •     హైదరాబాద్ సహా ఉమ్మడి మెదక్,  నిజామాబాద్ జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు
  •     అధికారుల సమన్వయ లోపం.. నిర్లక్ష్యం వల్లే పనుల్లో జాప్యం

సంగారెడ్డి, వెలుగు:  సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ పనులు స్లోగా సాగుతున్నాయి. ఎండాకాలంలోనే పనులు కంప్లీట్ చేయాల్సి ఉండగా, ఈ వానాకాలం సీజన్ చివరి వరకు కూడా పూర్తయ్యే  పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌లోని 8 కిలోమీటర్లు మేర రాతికట్ట ఉండగా సుమారు 600 మీటర్లు డ్యామేజ్ అయ్యింది. గతేడాది నేషనల్ డ్యామ్‌‌‌‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ) అధికారులు రిపేర్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించడంతో చలికాలంలో పనులు స్టార్ట్ చేశారు. 

వేసవి ముగిసేలోపు పనులు కంప్లీట్‌‌‌‌ చేయాల్సి ఉండగా.. ఇంకా పూర్తికాలేదు. ఈ పనుల కోసం ప్రాజెక్ట్‌‌‌‌ ఖాళీ చేశారు. దీనివల్ల 29.19 టీఎంసీల పూర్తి సామర్థ్యానికిగానూ 8 టీఎంసీలే నిల్వ చేయాల్సిన పరిస్థితి. హైదరాబాద్ సహా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం వల్లే పనుల్లో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో పనుల పూర్తికి మరో ఏడాది పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మూడు ఉమ్మడి జిల్లాలకు జీవనాడి 

హైదరాబాద్‌‌‌‌ సహా ఉమ్మడి మెదక్‌‌‌‌, నిజామాబాద్ జిల్లాలకు సింగూరు ప్రాజెక్ట్‌‌‌‌  జీవనాడి. హైదరాబాద్‌‌‌‌ నగర తాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ సమీపంలో 1976లో 527 మీటర్ల ఎత్తులో 29.917 టీఎంసీల సామర్థ్యంతో మంజీరాపై సింగూరు ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ కింద సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సుమారు 80వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దిగువ భాగంలోని సంగారెడ్డి మంజీరా ప్రాజెక్టు, మెదక్ జిల్లా వనదుర్గ (ఘనపురం) ఆనకట్ట, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు సింగూర్‌‌‌‌‌‌‌‌పైనే ఆధారపడి ఉన్నాయి. హైదరాబాద్‌‌‌‌తోపాటు రంగారెడ్డి జిల్లాకు మెట్రోపాలిటన్, మిషన్ భగీరథ ద్వారా సింగూరు నుంచి తాగునీటిని అందిస్తున్నారు.  

స్లోగా పనులు 

సింగూరు ప్రాజెక్టుకు ఒక భాగంలో 8 కిలోమీటర్ల మేర రాతికట్ట నిర్మించారు. ఈ రాతికట్టలో 600 మీటర్ల రివిట్‌‌‌‌మెంట్‌‌‌‌ డ్యామేజ్ అయింది. దీని రిపేర్ల కోసం ప్రభుత్వం రూ.16.08కోట్లు మంజూరు చేసింది. కాగా ఈ పనుల కోసం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ(1.5 టీఎంసీలు)కి ప్రభుత్వం అంగీకరించకుండా దశలవారీగా నీటిని ఖాళీ చేసేందుకు అనుమతించింది. ఎండాకాలంలో పూర్తి చేయాల్సిన పనులను వర్షాకాలంలో కొనసాగించడం వల్ల పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. ప్రాజెక్టులో నీటిని బయటికి వదిలే విషయంలో సకాలంలో ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ అనుమతులు రాకపోవడంతోపాటు ప్రాజెక్టు గేట్ల ద్వారా కాకుండా విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయడంతోపాటు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. 

మరోవైపు ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాత 4 నెలలు వరకు కూడా పనులు మొదలుపెట్టకపోవడంతో జాప్యం జరుగుతోంది. ఏటా మహారాష్ట్ర , కర్ణాటకలో వర్షాలు పడితే సింగూరు ప్రాజెక్ట్‌‌‌‌లోకి నీరు చేరుతుంది. ఎల్‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌తో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ఈక్రమంలో ప్రస్తుతమున్న 8 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు 17 భారీ మోటార్ల ద్వారా పంప్‌‌‌‌ చేసినా వర్షాలు పడక జంటనగరాలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతం నీటి పంపింగ్ పనులు కొనసాగుతుండగా, నెల రోజుల్లో ఆ పనులు పూర్తికానున్నాయి. -----------

హైదరాబాద్‌‌‌‌ తాగునీటికి ఇబ్బందులు 

సింగూరు ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగితే నీటి కొరత ఏర్పడే ప్రమాదముంది. ఇదే జరిగితే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. రాజధానికి తాగునీటి సరఫరా చేయడంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై (హెచ్ఎండబ్ల్యూఎస్) ద్వారా సింగూరు ప్రాజెక్టుదే ప్రధాన పాత్ర. సింగూరు నుంచి సదాశివపేట మండలం పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌లోని ఫిల్టర్ బెడ్ ద్వారా నీటిని శుద్ధి చేసి ప్రతి రోజు 120 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరా అవుతుంది. 

ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో రోజువారీగా 130 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్ట్ పనుల్లో జాప్యంతో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి తలెత్తితే సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యలు తలెత్తనున్నాయి. ఈక్రమంలో ప్రాజెక్ట్ పనులు వీలైనంత తొందరగా పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.