- వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం
- వినియోగదారులకు వేగంగా సేవలందిస్తాం: సీఎండీ జితేష్ వి.పాటిల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విద్యుత్ అంతరాయాలను గుర్తించి సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) బుధవారం నుంచి సమగ్ర విద్యుత్ నెట్‌వర్క్ మ్యాపింగ్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి దశలో ఈ డ్రైవ్‌ను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో అమలు చేయనున్నారు.
దీని ద్వారా 132/33 కేవీ ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ల నుంచి మొదలుకొని, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 11 కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు) చివరిగా ప్రతి వినియోగదారుడి సర్వీస్ కనెక్షన్ వరకు విద్యుత్ నెట్‌వర్క్ అనుసంధానాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. జులై నెల బిల్లింగ్ ప్రక్రియలో భాగంగా మీటర్ రీడర్లు ప్రతి డీటీఆర్‌ను విజిట్‌చేసి ఆయా ట్రాన్స్‌ఫార్మర్లకు లింక్అయిన సర్వీసులను మ్యాపింగ్ చేస్తారు. ఒక కస్టమర్ఇంటికి ఏ సబ్‌స్టేషన్, ఏ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుందనే వివరాలు డిజిటల్ గా నమోదుకానున్నాయి.
సమస్య ఎక్కడుందో తెలిసేలా..
ఈ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వినియోగదారులకు అత్యంత వేగంగా సేవలు అందనున్నాయి. ఎవరైనా వినియోగదారుడు 1912 కాల్ సెంటర్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ సమస్య ఎక్కడ ఉంది..? అనేది వ్యవస్థ ఆటోమెటిక్ గా గుర్తిస్తుంది. దీనివల్ల సమస్యను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. కరెంట్ నిలిచిపోవడానికి గల కారణాలు, పునరుద్ధరణకు పట్టే అంచనా సమయం వంటి వివరాలను వినియోగదారులకు అందించే అవకాశం ఉంటుంది.
