ట్యాంక్ బండ్ రీ వ్యాంప్!...హుస్సేన్ సాగర్ తీరానికి మేకోవర్

ట్యాంక్ బండ్ రీ వ్యాంప్!...హుస్సేన్ సాగర్ తీరానికి మేకోవర్
  •     ‘సాగర్’ ​మీదుగా రోప్​వాక్​
  •     లుంబినీ, ఎన్టీఆర్​ గార్డెన్​లో కొత్త అందాలు 
  •      కొత్త ప్రాజెక్టు అమలుకు హెచ్ఎండీఏ రెడీ  

హైదరాబాద్​సిటీ, వెలుగు: హుస్సేన్​సాగర్​తీరాన్ని మరింతగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ ప్లాన్లు వేస్తోంది. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్​హబ్​గా మార్చేందుకు హెచ్ఎండీఏలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అధికారులు మాస్టర్​ప్లాన్​రూపొందిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే ఒక సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సదరు సంస్థ.. ట్యాంక్​బండ్, ఎన్టీఆర్​గార్డెన్, లుంబినీ పార్క్​తో పాటు హుస్సేన్​సాగర్​తీరంలో ఏం చేస్తే మరింత మంది పర్యాటకులు వస్తారో చెప్తూ నివేదిక ఇస్తుంది. దీనికి ట్యాంక్​బండ్ రీ వ్యాంప్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. 

అసలేంటి రీవ్యాంప్​ ప్రాజెక్టు? 

హుస్సేన్​సాగర్​తీరంలో సెక్రటేరియట్​నుంచి మొదలుపెడితే లుంబినీపార్క్, ఎన్టీఆర్​గార్డెన్స్, నెక్లెస్​రోడ్, పీపుల్స్​ప్లాజా, లేక్​ఫ్రంట్​పార్క్​, జలవిహార్, వాటర్​ఫాల్స్​వంటి ఎన్నో విజిటింగ్​ప్లేసెస్​ఉన్నాయి. వీటిని రీ వ్యాంప్​ప్రాజెక్టులో భాగంగా మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్​గార్డెన్, లుంబినీపార్క్​లో ప్రస్తుతం ఉన్న వివిధ రకాల నిర్మాణాలు, ఆకర్షణలను పునరుద్ధరించబోతున్నారు. 

హుస్సేన్​సాగర్​లో జీహెచ్ఎంసీ వైపు నుంచి సంజీవయ్యపార్క్​వరకూ రోప్​వాక్​ప్రతిపాదన కూడా ఉందని అధికారులు తెలిపారు. అది సాధ్యం కాకపోతే లుంబినీ పార్క్​నుంచి సంజీవయ్యపార్క్​వరకు రోప్​వాక్​ నిర్మించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం హుస్సేన్​సాగర్​తీరానికి రోజుకు 15వేల మంది వరకు టూరిస్టులు వస్తుండగా..పండగలు,సెలవు దినాలు, వీకెండ్​లో ఈ సంఖ్య 50వేలకు చేరుకుంటోంది. ఈ సంఖ్య మరింత పెరగాలంటే ట్యాంక్​బండ్​పై మరిన్ని ఆకర్షణలు తప్పని సరి అని అధికారులు భావిస్తున్నారు.