హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2 లోని నంది, ప్యాకేజీ 8 పంప్ హౌస్ లలోని 14 మోటార్లను బుధవారం నుంచి ఈనెల 4 వరకు రోజుకు 15 నిమిషాల చొప్పున డ్రై రన్ చేయనున్నారు. ఇందుకు ట్రాన్స్ కో నుంచి అప్రూవల్ లభించింది. వర్షాకాలంలో ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా అధికారులు ఈ టెస్టులు చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల కోసం జియో టెక్నికల్ టెస్టులు దాదాపు పూర్తయ్యాయి.
బ్యారేజీల పటిష్టతను తెలుసుకునేందుకు రాఫ్ట్ ల కింద నుంచి కోర్ శాంపిళ్లను సేకరించి పరీక్షించారు. బ్యారేజీల కింద గోతులను గుర్తించేందుకు జీపీఆర్ టెస్టులు చేస్తున్నారు. అన్నారంలో 66 గేట్ల వద్ద ఈ పరీక్షలు పూర్తికాగా, ఆ డేటాను అసెస్మెంట్ కోసం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) కు పంపారు. మేడిగడ్డలో 79, సుందిళ్లలో 71 గేట్ల వద్ద జీపీఆర్ టెస్టులు కంప్లీట్ అవ్వగా.. మిగతావి మరో 15 రోజుల్లో పూర్తి చేయనున్నారు.
