ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 2 లక్షల పోస్టులతో నోటిఫికేషన్రిలీజ్చేయాలని ఓయూ, నిరుద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీల లీడర్లు జార్జిరెడ్డి, డాక్టర్ ఎస్.నాగేశ్వర రావు, ఎన్. సుమంత్, కె.స్వాతి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను రద్దు చేసి పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి, నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే దాకా కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఎటువంటి ఇంక్రిమెంట్లు ఇవ్వొద్దని కోరారు. కాంగ్రెస్ సర్కారులోనైనా ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇప్పటికీ నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని 2 లక్షల ఉద్యోగాలతో పాటు డీఎస్సీ, 20 వేల పోలీస్ కొలువులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
