కరీంనగర్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

కరీంనగర్  ఆర్టీసీ డిపోలో  ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు వరుసగా అగ్నిప్రమాదాలకు గురవుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో ఒక ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, కొద్దిరోజుల క్రితమే అలుగునూరు సమీపంలో హైదరాబాద్ వెళ్తున్న ఇలాంటి ఎలక్ట్రిక్ బస్సులోనే మంటలు చెలరేగి అది పూర్తిగా బూడిదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు డిపోలోనే మరో ఈవీ బస్సు తగలబడటంతో.. ఈ ఎలక్ట్రిక్ బస్సుల భద్రతపై ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

ఈ ప్రమాదంపై ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) రాజు స్పందించారు. ఉదయం డిపో నుంచి బస్సును బయటకు తీస్తుండగా ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించామని.. వెంటనే డ్రైవర్ బస్సును ఆపేసి ఫైర్ సర్వీసుకు సమాచారం అందించారని తెలిపారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు సాగుతోందని ఆయన తెలిపారు.

ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టు సంస్థతో కలిసి ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై సమీక్షిస్తున్నామని.. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరగడంపై ఆర్టీసీ యాజమాన్యంలోనూ ఆందోళన ఉందని ఆర్ఎం రాజు అంగీకరించారు. గతంలో అలుగునూరు దగ్గర జరిగిన ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారని.. ఇవాళ్టి ప్రమాదంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.