భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కుసుమ్ స్కీంలో భాగంగా ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 690 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఆయన జిల్లాలో పర్యటించి ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
కొత్తగూడెంలోని ఎస్‌ఈ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. కమలాపురంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి పెంట్లం సబ్‌స్టేషన్ వరకు 12 కిలోమీటర్ల మేర ఇంటర్‌లింక్ లైన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
గ్రామం గుండా 33/11 కేవీ లైన్ వెళ్తుండటంతో సుమారు 700 మీటర్ల మేర ఇన్సులేటెడ్ కవర్ కండక్టర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దమ్మపేట మండలం అంకంపాలెంలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని పోడు భూములకు కనెక్షన్లు ఇచ్చే ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఆయిల్ పామ్ తోటలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. గండుగులపల్లిలో సబ్‌స్టేషన్ నిర్మాణం కొనసాగుతోందని, రాజాపురంలో దాదాపు రూ.4 కోట్ల వ్యయంతో మరో సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నామని తెలిపారు. వరంగల్ లో అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పర్యటనలో ఎస్‌ఈ జి.మహేందర్, డీఈలు నందయ్య, రంగస్వామి, జీవన్ కుమార్
పాల్గొన్నారు.
