హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలం బోడుప్పల్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో1,166 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1974లో గ్రామపంచాయతీ లేఅవుట్‌గా టెలిఫోన్ కాలనీ ఏర్పడగా, ఇందులో 1,166 గజాలను పార్కుకు కేటాయించారు. ఈ స్థలాన్ని కొంతమంది కబ్జా చేయడానికి ఫెన్సింగ్వేసింది. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు రాగా, హైడ్రా పరిశీలించింది. బోడుప్పల్‌లోని సర్వే నంబర్లు 78,79లో ఈ కాలనీ ఏర్పడిందని, గ్రామపంచాయతీ లేఅవుట్ అయినప్పటికీ ఇందులో ప్లాట్లు, బిల్డింగులకు ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పర్మిషన్లు కూడా మంజూరయ్యాయని గుర్తించింది.
పార్కు పక్కనే ఉన్న ప్లాట్ల సేల్ డీడ్‌లను పరిశీలించగా పార్కు స్థల హద్దులు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. లేఅవుట్, రిజిస్టర్డ్ పేపర్లతో పాటు కాలనీ వాసుల వాంగ్మూలం ఆధారంగా 1,166 చదరపు గజాల స్థలం పూర్తిగా పార్కు స్థలమేనని నిర్ధారించింది. ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించి పార్కు స్థలంగా బోర్డు ఏర్పాటు చేసింది. హద్దులు నిర్ధారించి, ఫెన్సింగ్ వేసింది.
