వెలుగు ఓపెన్ పేజీ : రోస్టర్ సవరణతోనే మాలలకు న్యాయం

వెలుగు ఓపెన్ పేజీ : రోస్టర్ సవరణతోనే మాలలకు న్యాయం

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం 2025 అమలులోకి వచ్చిన కేవలం 10 నెలల్లోనే  మాదిగలకు గ్రూప్–2 వారికి 16000,   గ్రూప్-3 వారికి 10,000,  772 డాక్టర్/ ఇంజినీర్,  మొత్తం 26,772 ఉద్యోగాలు మాదిగలకు  వచ్చాయని సాక్షాత్తు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.  శిల్పకళా వేదికలో మార్చి 6, 2026న  జరిగిన  మాదిగ  ఉద్యోగుల  కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్‌‌లో అధికారికంగా ప్రకటించారు.  మాదిగలకు  వేలల్లో ఉద్యోగాలు రావడం మాలలు వ్యతిరేకించడం లేదు.  కానీ 26 మాల,  మాల అనుబంధ కులాలకు  వేళ్లతో లెక్కించే ఉద్యోగ అవకాశాలు కూడా రాకపోవడం  తీవ్ర అసహనానికి గురిచేస్తోంది.  ఇదే ఇప్పుడు పెద్ద ఉద్యమంగా మారుతోంది.  

తెలంగాణ  రాష్ట్ర  షెడ్యూల్డ్ కులాల  రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం 2025తోపాటు  జీవో  ఎంఎస్ 99లో  పేర్కొన్న రోస్టర్  పాయింట్లతో  కేవలం గ్రూప్ –2కి మాత్రమే అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవిధంగా చేశారని పైన  పేర్కొన్న లెక్కల ద్వారా స్పష్టంగా తేలిపోయింది.  వివిధ శాఖల్లో తాత్కాలిక, అవుట్‌‌సోర్సింగ్‌‌, కాంట్రాక్ట్,  పర్మినెంట్ ఉద్యోగ నియామకాలలో గ్రూప్ –3లోని 26 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈ సందర్భంగా నవంబర్ 4,  2024న  సుప్రీంకోర్టు ఇ.వి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  కేసులో ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం (రిజర్వేషన్ల మినీ రాజ్యాంగం)లోని  జస్టిస్  హెచ్ కే  సేమ తన తీర్పులో  ‘ఒకరికి అన్యాయం జరిగింది అని ఇంకొకరికి అన్యాయం చేసి న్యాయం చేయాలని చూస్తే అది అన్యాయాన్ని సమాజంలో శాశ్వతంగా కొనసాగించడమే అవుతుంది’ అని పేర్కొన్నారు.  అది ఈ చట్టంలో మాదిగలకు అన్యాయం జరిగిందని మాలలకు అన్యాయం చేస్తూ మాదిగలకు న్యాయం చేశారు అని స్పష్టంగా కనిపిస్తుంది. 

మాదిగల మెప్పుకోసం 9శాతం రిజర్వేషన్లు

ప్రస్తుత చట్టంలో  రోస్టర్ విధానం  రాజకీయంగా  మాదిగల మెప్పుకోసం అత్యధికంగా 9 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం,  మాదిగలు  కోరుకున్నవిధంగా మాలలకు అసలు ఉద్యోగాలు రాకుండా చేయడం,  మాదిగల కుట్రను  పాలకులు  పరోక్షంగా  అమలుచేశారని  మాలలు బలంగా నమ్ముతున్నారు.  గత 1996లో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు  జస్టిస్  రామచంద్ర రాజు కమిషన్ సూచనల మేరకు గ్రూప్ ఎ రోస్టర్ 2, గ్రూప్ డి రోస్టర్ 7,  గ్రూప్ సి రోస్టర్ 16,  గ్రూప్ డి రోస్టర్ 52,  ఉప వర్గీకరణ చేస్తూ జారీ చేసిన జీవో ఎంఎస్ 68 తేదీ  6 -– 6 -–1997  పిటిషనర్  బి నారాయణ అండ్ అదర్స్ హైకోర్టులో  కేసు వేస్తే ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఆ జీఓ 68ను రద్దు చేసింది.  అనంతరం ఆర్డినెన్స్ నెంబర్ 9 ఆఫ్  1999  తెచ్చి ఉప వర్గీకరణ  అమలు చేయాలని చూస్తే  ఈ ఆర్డినెన్స్​పై  హైకోర్టును  ఆశ్రయిస్తే  హైకోర్టులో  కేసు పెండింగ్ ఉండగానే  ఆంధ్రప్రదేశ్  షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం-2000,  ఆక్ట్ 20 ఆఫ్ 2000,  తేదీ 2-–5–-2000 చట్టం చేశారు.  ఆ చట్టంలో  ఏ, బీ, సీ, డీ అని 4 గ్రూపులుగా చేస్తూ  గ్రూపు– ఏకు  రోస్టర్ 2, 1%,   గ్రూప్– బీ 7,22,  41,65, 72,87,  97, 7%,  గ్రూప్ –సీ 16 27 47 66 77,  91, 6%,   గ్రూప్ – డీ 52, 1%  కేటాయించడం జరిగినది. ఈ చట్టం ద్వారా  ఎస్సీలకు  నాలుగు పోస్టులు  వస్తే 4 గ్రూపులకు సమానంగా అందేవి. 

మాలలు తీవ్ర నిరాశ

భారత  అత్యున్నత  న్యాయస్థానం చీఫ్  జస్టిస్  డీవై  చంద్రచూడ్ సారథ్యంలోని  ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం.. ఇంకా రిజర్వేషన్ ఫలాల రుచి చూడనివారిని గుర్తించి  విద్య,  ఉద్యోగాలలో  ప్రాధాన్యత ఇవ్వాలని  పేర్కొన్నారు.  దాన్ని ఉల్లంఘిస్తూ  ప్రాధాన్యత ఇవ్వాల్సిన  గ్రూప్ –1కి ఇవ్వకుండా,   ఆల్రెడీ మధ్యస్థంగా లబ్ధి పొందిన గ్రూప్– 2 మాదిగలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.  గ్రూప్– 3లోని  మాలలకు అసలు ఉద్యోగ అవకాశాలు రాకుండా రోస్టర్ల  కూర్పు జరగడంతో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌‌లలో అవకాశాలు రాకపోవడంతో మాలలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.    మాలలకు  జరుగుతున్న అన్యాయాన్ని అతి త్వరలో సవరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌‌కుమార్  బహిరంగంగా  ప్రకటనలు చేశారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం   పనిలో  ఉందని  విశ్వసనీయ సమాచారం.

రోస్టర్​ సవరణ చేయాలి

మాలల  ఆవేదనను  కొంతలో కొంతైనా తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న 22 రోస్టర్ నుంచి 16వ  రోస్టర్‌‌‌‌కు మారుస్తూ  50 రోస్టర్‌‌‌‌లో 3 రోస్టర్లు  మాలలకు వచ్చేవిధంగా చేయాలి.  తెలంగాణ  రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం- 2025 సెక్షన్ 7,  రూల్స్​కు  సంబంధించిన జీవో ఎంఎస్ 10,  తేదీ 14– - 4– -2025లోని  రూల్ 8లో  పేర్కొన్నవిధంగా  రోస్టర్ సవరణ చేసి  ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేస్తే  మాలలకు కొంతైనా ఊరట లభించే అవకాశం ఉంటుంది.  పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారనే  భావనలో మాలలో ఉన్నారు.  లేకుంటే  రాబోయే  గ్రేటర్  హైదరాబాద్ ఎన్నికల్లో ఈ రోస్టర్ అంశం  ప్రభావం  కచ్చితంగా కాంగ్రెస్​ప్రభుత్వంపై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

- బత్తుల 
రామ్ ప్రసాద్
రాష్ట్ర అధ్యక్షుడు,
మాల సంక్షేమ సంఘం

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.