- ఈ కారణంతో తెలంగాణలో 77 శాతం మంది గైర్హాజరు
- వివరాలు వెల్లడించిన - ఎన్ఐఆర్డీ - పీఆర్ స్టడీ రిపోర్ట్
న్యూఢిల్లీ, వెలుగు: అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పనుల ప్రణాళికలు, సమస్యలపై చర్చించడానికి వేదికగా భావించే గ్రామ సభలకు రోజువారీ కూలీ, వ్యవసాయ పనుల వల్లే జనం రాలేకపోతున్నారు. తెలంగాణలో అత్యధికంగా 77 శాతం మంది సభలకు హాజరుకాలేకపోతున్నారు. ఈ ఆసక్తికర విషయాలను హైదరాబాద్‌కు చెందిన 'జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ' (ఎన్ఐఆర్డీపీఆర్) తన స్టడీ రిపోర్ట్ లో వెల్లడించింది.
సభలు జరిగే వేళలు, తమ పని వేళలతో ముడిపడి ఉండటంతో ఆశించిన స్థాయిలో గ్రామ సభలు సక్సెస్ కాలేకపోతున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 7,790 మంది అభిప్రాయాలను సేకరించి "లో పార్టిసిపేషన్ ఇన్ గ్రామసభ" పేరుతో రిపోర్ట్ ను సిద్ధం చేసింది. ఈ రిపోర్ట్ ను మంగళవారం న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియం విడుదల చేశారు. ఈ సర్వేలో తెలంగాణ 501 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నట్లు నివేదిక తెలిపింది.
అవగాహన సరే.. హాజరయ్యే వారేరి..?
తెలగాణలో గ్రామసభలపై ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ, పాల్గొనే వారు ఎక్కువ మంది లేరని రిపోర్టు నివేదించింది. 93.41 శాతం మందికి గ్రామసభల నిర్వహణపై పూర్తి అవగాహన ఉన్నా.. కేవలం 55.09 శాతం మంది మాత్రమే ప్రశ్నిస్తున్నారు. గ్రామ సభల్లో తమకున్న హక్కుల గురించి తెలిసిన వారు 52.30 శాతం మంది ఉన్నారు. సభ జరగాలంటే ఎంతమంది కోరం ఉండాలనే విషయం తెలిసిన వాళ్లు కేవలం 19.16 శాతం మందే ఉండడం ఆందోళన కలిగించే అంశం.
గ్రామసభల్లో 16.03 శాతం మంది స్థానిక సమస్యలు, 12.79 మంది పారిశుధ్యం, 10.02శాతం మంది సంక్షేమ పథకాలపై మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపునకు 7.99 శాతం, ఆరోగ్యం-, అక్షరాస్యతపై 7.39 శాతం మంది ప్రశ్నిస్తున్నారు. నిధుల వినియోగంపై జరిగే సామాజిక తనిఖీకి 6.79 శాతం, ఇతర సామాజిక సమస్యలపై 6.14 శాతంపై మాట్లాడుతున్నట్లు రిపోర్టు వెల్లడించింది.
