కృష్ణా, గోదావరిలో మళ్లీ నీటి లెక్కలు..హైడ్రాలజీ స్టడీస్ చేసి సమాచారం పంపించాలని రాష్ట్రాలకు NWDA లేఖ

కృష్ణా, గోదావరిలో మళ్లీ నీటి లెక్కలు..హైడ్రాలజీ స్టడీస్ చేసి సమాచారం పంపించాలని రాష్ట్రాలకు NWDA లేఖ
  • బేసిన్లలోని నీటి లభ్యత, వినియోగం, మిగులు లెక్కలు పంపాలని ఆదేశాలు
  • మన దగ్గర గోదావరిలోని పెన్​గంగ, లోయర్​ గోదావరి లెక్కలపై ఆరా

హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరితో పాటు వివిధ నదీ బేసిన్లలో కేంద్రం మరోసారి నీటి లెక్కలు తీయాలని నిర్ణయించింది. ఇప్పటికే 2021లో హైడ్రాలజీ స్టడీస్​ చేసినా.. ఆ సమాచారం పాతదైపోయిందని భావిస్తున్న కేంద్రం కొత్తగా మళ్లీ ఆ డేటాను అప్​డేట్​ చేయాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే రివైజ్డ్​ హైడ్రాలజీ డేటాను పంపాలని వివిధ రాష్ట్రాలకు నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) లేఖలు రాసింది. గోదావరి–కావేరి లింక్​ నేపథ్యంలో 2021లో ఎన్​డబ్ల్యూడీఏ నీటి లెక్కలు తీసింది. తాజాగా మళ్లీ హైడ్రాలజీ డేటా కోసం ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ లేఖలు రాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివిధ రాష్ట్రాల్లోని బేసిన్లలో నీటి లభ్యత, వాటాలు, వినియోగం, మిగులు వంటి వాటిపై రివైజ్డ్​ డేటా ఇవ్వాలని  రాష్ట్రాలను ఎన్​డబ్ల్యూడీఏ కోరింది. మన రాష్ట్రంలో గోదావరిలోని జీ7 (పెన్​గంగ), జీ10 (లోయర్​ గోదావరి)లలో హైడ్రాలజీపై వివరాలు ఇవ్వాలని కోరినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇటు కృష్ణాలోనూ నీటిలభ్యతపై సమగ్ర వివరాలను ఇవ్వాలని సభ్య రాష్ట్రాలను కోరినట్టు తెలుస్తున్నది. అందుకు అనుగుణంగా అధికారులు రివైజ్డ్​ నీటి వినియోగం, లభ్యత, మిగులు వంటి అంశాలపై నివేదికను సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు.

పీబీ లింక్​ కోసమేనా?

గోదావరి-–కావేరి లింక్​లో భాగంగా 148 టీఎంసీల తరలింపునకు కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఛత్తీస్​గఢ్​ వాడుకోని నీళ్లను తరలించి తమిళనాడులోని కరువు ప్రాంతాలకు ఇవ్వాలన్నది కేంద్రం లక్ష్యం. అందులో భాగంగా మనకు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు అందులో వాటాలు ఇస్తామని స్పష్టం చేసింది. కాగాఈ లింక్​పై సభ్య రాష్ట్రాలన్నీ పేచీలు పెడ్తుండడం.. కేంద్రం తన మిత్రపక్షమైన ఏపీలోని ప్రభుత్వానికి సహకరించేలా వ్యవహరిస్తుండడంతో ప్రస్తుతం హైడ్రాలజీ వివరాలు అడగడం అనుమానాలకు తావిస్తున్నది.

పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్​లో భాగంగా 200 టీఎంసీలను తరలించాలని ఏపీ లక్ష్యం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే లోలోపల ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం కూడా పోలవరం బనకచర్ల ద్వారానే కావేరికి నీటిని తరలించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. పోలవరం బనకచర్ల తెరపైకి తెచ్చిన నేపథ్యంలో.. సీడబ్ల్యూసీ నీటిలెక్కల మీద ఏపీ గతంలో అభ్యంతరాలు తెలిపింది. నీటి వాటాలపైనా తన అబ్జెక్షన్​ చెప్పింది. అందులో భాగంగానే మళ్లీ ఇప్పుడు కొత్తగా నీటి లెక్కలను కేంద్రం తెరపైకి తీసుకొచ్చినట్టు చర్చ జరుగుతున్నది.  

కాళేశ్వరంతో తకరారు..

ప్రస్తుతం నీటి లెక్కలకు సంబంధించి ప్రాణహితలోని వరదపైనా రివైజ్డ్​ డేటాను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. గతంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం ప్రాణహితలో 165 టీఎంసీల లభ్యత ఉన్నట్టు గతంలో సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) హైడ్రాలజీ రిపోర్టు కూడా ఇచ్చింది. కానీ తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టిన గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. రీడిజైనింగ్​లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. కాళేశ్వరం ద్వారా తరలించాలనుకున్న 195 టీఎంసీల జలాల్లో ప్రాణహితలోని 145 టీఎంసీలను కాళేశ్వరం ప్రాజెక్టుకు చూపించింది. దీంతో ప్రాణహితలో మరో 20 టీఎంసీలే ఉంటాయంటూ గతంలో సీడబ్ల్యూసీ చెప్పింది. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలో లేకపోవడం,  తుమ్మిడిహెట్టి ద్వారా 80 టీఎంసీలను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడంతో మరోసారి రివైజ్డ్​ హైడ్రాలజీ డేటాను సమర్పించాల్సిన అవసరం కనిపిస్తున్నది.

8న ప్రగతి.. 

2న ఎంక్యాడ్​ మీటింగ్​లువివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఆయకట్టు, నిధుల వినియోగం, ఎదురవుతున్న ఆటంకాలపై కేంద్ర ప్రభుత్వం వరుస మీటింగులు నిర్వహించబోతున్నది. పీఎంకేఎస్​వై కింద చేపట్టే ప్రాజెక్టుల్లోని ఆయకట్టు అభివృద్ధిపై జులై 2న మోడర్నైజేషన్​ ఆఫ్​ కమాండ్​ అండ్​ ఏరియా డెవలప్​మెంట్​ (ఎంక్యాడ్​) కమిటీ మీటింగ్​ నిర్వహించనుంది. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్యాడ్​కు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 2న జరిగే మీటింగ్​లో జకోరా చందూరు లిఫ్ట్​ కింద ఉన్న ఆయకట్టు అభివృద్ధిపై చర్చిస్తామని ప్రభుత్వానికి పంపిన సమాచారంలో కేంద్రం తెలిపింది.

ఇక, ఈ నెల 8న ప్రధాని నేతృత్వంలో ప్రగతి మీటింగ్​ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 8 ప్రాజెక్టులు 15 అంశాలపై చర్చించనున్నారు. అందులో మన రాష్ట్రం నుంచి దేవాదుల, రాజీవ్​ భీమా లిఫ్ట్​లను చేర్చారు. దేవాదులకు సంబంధించి రెండు సమస్యలు, రాజీవ్​ భీమా లిఫ్ట్​కు సంబంధించి ఒక సమస్యను చర్చించనున్నట్టు రాష్ట్రానికి పంపిన సమాచారంలో కేంద్రం తెలిపింది. అయితే, ప్రతిసారి ప్రగతి మీటింగ్​లో పోలవరం అజెండాను పెట్టి.. చివరి నిమిషంలో సమావేశాన్ని రద్దు చేసిన కేంద్రం.. ఈ సారి మాత్రం ప్రగతి మీటింగ్​ అజెండాలో పోలవరం అంశాన్నే చేర్చకపోవడం గమనార్హం.