చెన్నై: తమిళనాడులో గోవధ నిషేధ వివాదం మరింత ముదురుతోంది. రాష్ట్రంలో గోవధపై సంపూర్ణ నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో విజయ్ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. తమిళనాడు జంతు సంరక్షణ 1958 చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, పనికి లేదా సంతానోత్పత్తికి పనికిరానివిగా ఉన్నట్లు సంబంధిత అధికారులు ధృవీకరిస్తే, అటువంటి ఆవులను వధించడానికి చట్టబద్ధమైన అనుమతి ఉందని.. కానీ హైకోర్టు తీర్పు ఈ చట్టానికి విరుద్ధంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.
గోవధపై సంపూర్ణ నిషేధాన్ని విధించడం ద్వారా హైకోర్టు తన చట్ట పరిధిని దాటిందని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. ఈ తీర్పు ద్వారా హైకోర్టు శాసన చట్టానికి బదులుగా న్యాయ శాసనాన్ని ప్రవేశపెట్టిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
అసలు వివాదం ఏంటంటే..?
బక్రీద్ పండుగ సందర్భంగా బహిరంగా ప్రదేశాల్లో గోవధ చేయకుండా ఆంక్షలు విధించాలని హిందూ మక్కల్ కచ్చి యువజన విభాగం కార్యదర్శి కె. సూర్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ 2026, మే 27న సంచలన తీర్పు వెలువరించింది.
ఒక్క బక్రీద్ రోజే కాకుండా మరే ఇతర రోజైనా తమిళనాడులో ఆవు, దూడను గానీ వధించవద్దని ఆదేశాలు జారీ చేసింది. పశుసంరక్షణ, గోవధ నిషేధాన్ని సూచించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 48తో పాటు పాల ఉత్పత్తిని పెంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి గోవధను నిషేధించిన 1976 నాటి జీవో ఆధారంగా ఈ తీర్పు వెలువరించినట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే, తమిళనాడు జంతు సంరక్షణ 1958 చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, పనికి లేదా సంతానోత్పత్తికి పనికిరానివిగా ఉన్నట్లు సంబంధిత అధికారులు ధృవీకరిస్తే, అటువంటి ఆవులను వధించడానికి చట్టబద్ధమైన అనుమతి ఉంది. కానీ హైకోర్టు ఈ నిబంధనను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రంలో గోవధపై సంపూర్ణ నిషేధం విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలీ.
