అధిక వడ్డీ ఆశ చూపి ..కుషాయిగూడలో రూ.50 కోట్లతో వ్యాపారి పరార్!

అధిక వడ్డీ ఆశ చూపి ..కుషాయిగూడలో రూ.50 కోట్లతో వ్యాపారి పరార్!
  • కుషాయిగూడ వ్యాపారిపై మల్కాజిగిరి సీపీకి బాధితుల ఫిర్యాదు
  • పెళ్లి, వ్యాపారం పేరుతో డబ్బులు వసూలు చేసి టోకరా

మల్కాజిగిరి, వెలుగు: అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి రూ.50 కోట్లకు పైగా వసూలు చేసుకొని ఓ వ్యాపారి పరారైన ఘటన వెలుగుచూసింది. బాధితులు లబోదిబోమంటూ మంగళవారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వ్యాపారి వద్ద నుంచి తమకు డబ్బులు ఇప్పించాలని సీపీని వేడుకొన్నారు. కుషాయిగూడ భగవాన్ కాలనీ, చక్రిపురానికి చెందిన పబ్బ చంద్రశేఖర్(50) గత 30 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడని బాధితులు తెలిపారు.

వ్యాపార సంబంధాలు, వ్యక్తిగత పరిచయాలు ఉన్నవారిని నమ్మించి కూతురు పెళ్లి ఉందని, తండ్రి చికిత్స అని, ఇంటి నిర్మాణం చేస్తున్నానని, వ్యాపారానికి కావాలని, కంపెనీ స్కీమ్‌ల పేరుతో డబ్బులు వసూలు చేశాడని పేర్కొన్నారు. కొంతమందికి ఎక్కువ వడ్డీ ఇస్తానని, మరికొందరి వద్ద చేబదులుగా డబ్బులు తీసుకున్నాడని బాధితులు వాపోయారు. మొత్తం 60 నుంచి 80 మంది వరకు బాధితులు ఉన్నారని, రూ.50 కోట్లకు పైగా వసూలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నెల 22 నుంచి చంద్రశేఖర్ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని, ఆయనతో పాటు భార్య కూడా కనిపించడం లేదన్నారు. ఇద్దరు కుమార్తెలను బంధువుల ఇంట్లో ఉంచి వెళ్లారని చెప్పారు. విదేశాలకు వెళ్లారన్న సమాచారం కూడా నిజమో కాదో తెలియడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. తమ పిల్లల చదువులు, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులను ఇచ్చామని, ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పూర్తి విచారణ చేసి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు.