ఖారా ప్యాకెట్‌లో బల్లి.. సిరిసిల్లలో స్వీట్ హౌస్ షాప్ సీజ్.. రూ. లక్ష ఫైన్

ఖారా ప్యాకెట్‌లో బల్లి.. సిరిసిల్లలో స్వీట్ హౌస్ షాప్ సీజ్.. రూ. లక్ష ఫైన్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ‘బాలాజీ స్వీట్ హౌస్’పై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ దుకాణంలో విక్రయించిన ఖారా (మిక్చర్) ప్యాకెట్‌లో బల్లి కనిపించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష నేతృత్వంలో అధికారులు సదరు స్వీట్ హౌస్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా.. తయారీ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ నిల్వ ఉంచిన నాణ్యత లేని, కాలం చెల్లిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని తక్షణమే మున్సిపల్ చెత్త వాహనంలో పారవేయించి ధ్వంసం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ మున్సిపల్ అధికారులు సదరు యాజమాన్యానికి రూ. 1 లక్ష భారీ జరిమానా విధించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం స్వీట్ తయారీ కేంద్రంతో పాటు విక్రయ దుకాణాన్ని పూర్తిగా సీజ్ చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష ప్రకటించారు.

హోటళ్లు, స్వీట్ హౌస్‌ల నిర్వాహకులు తప్పనిసరిగా కోవిడ్ తర్వాతి ఫుడ్ సేఫ్టీ నిబంధనలు, పరిశుభ్రత పాటించాలని అధికారులు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.