కరీంనగర్ హైవేపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

కరీంనగర్ హైవేపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి  ఢీకొట్టింది.ఆర్టీవో కార్యాలయానికి ఫిట్‌నెస్ పరీక్ష కోసం వెళ్తున్న లారీ.. సైడ్ ఇండికేటర్లు వేసి రోడ్డు దాటుతున్న క్రమంలో, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు దానిని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ముందు భాగం దెబ్బతినడంతో, లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు బస్సు అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ ఎగ్జిట్) గుండా ప్రయాణికులు క్షేమంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు.. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ఈ ప్రమాదం కారణంగా రాజీవ్ రహదారిపై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.