క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. జూలై 1 నుండి రూల్స్ మార్చేసిన HDFC, SBI

క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. జూలై 1 నుండి రూల్స్ మార్చేసిన HDFC, SBI

క్రెడిట్ కార్డ్‌ల ద్వారా ఉచితంగా లభించే లగ్జరీ సేవలకు కాలం చెల్లుతోంది. బ్యాంకులు తమ రివార్డు పాయింట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ రూల్స్ కఠినతరం చేస్తూ వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. జూలై 1, 2026 నుంచి దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ తమ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులను అమలులోకి తెచ్చాయి.  

మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వాడుతూ ఎయిర్‌పోర్ట్‌లలో ఉచితంగా లగ్జరీ లాంజ్ సేవలను ఆస్వాదించాలనుకుంటే ఇకపై కుదరదు. కొత్త రూల్ ప్రకారం.. ఒక క్యాలెండర్ త్రైమాసికంలో కనీసం రూ.60వేలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తేనే, తర్వాతి క్వార్టర్లో 3 ఉచిత డొమెస్టిక్ లాంజ్ విజిట్స్‌కు అర్హత లభిస్తుంది. ఇది ముఖ్యంగా రెగాలియా గోల్డ్, డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ వంటి పాపులర్ కార్డ్‌లకు వర్తిస్తుంది. అంటే ఉచితంగా ఎయిర్‌పోర్ట్ ఫుడ్, రెస్ట్ రూమ్స్ వాడాలంటే ముందుగా భారీగా షాపింగ్ చేయక తప్పదు ఇకపై.

ఎస్‌బీఐ కార్డ్ కూడా జూలై 1 నుండి తన ఎంపిక చేసిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ల రివార్డ్ పాయింట్ల నిర్మాణాన్ని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, సెలెక్ట్ బ్లాక్ వేరియంట్‌లపై నెలవారీ రివార్డ్ పాయింట్లకు పరిమితులను విధించింది. గతంలో ఉన్న అపరిమిత రివార్డుల స్థానంలో ఇప్పుడు కేటగిరీల వారీగా పరిమితులు వచ్చాయి.  

అంతేకాకుండా రివార్డ్ పాయింట్లు లభించని లావాదేవీల జాబితాను ఎస్‌బీఐ కార్డ్ మరింత పెంచింది. కొత్త రూల్స్ ప్రకారం.. టోల్ అండ్ బ్రిడ్జ్ పేమెంట్లు, ఎడ్యుకేషన్ ఫీజులు, జ్యువెలరీ కొనుగోళ్లు, గిఫ్ట్‌లు, ఫోన్‌పే యాప్ వెలుపల చేసే యుటిలిటీ, ఇన్సూరెన్స్, యూపీఐ పేమెంట్లకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు రావు. మొత్తంమీద ఈ జూలై నుండి క్రెడిట్ కార్డుల వాడకం మునుపటి కంటే కాస్త ఖరీదైనదిగా, పరిమిత ప్రయోజనాలతో అందుబాటులో ఉండనున్నాయ్.