రనౌట్‌తోనే ఆరంభం, ముగింపు: ఆ ఒక్క పోస్ట్‌తో అంతా ముగిసింది.. ధోనీ రిటైర్మెంట్‌కు ఆరేళ్లు!

రనౌట్‌తోనే ఆరంభం, ముగింపు: ఆ ఒక్క పోస్ట్‌తో అంతా ముగిసింది.. ధోనీ రిటైర్మెంట్‌కు ఆరేళ్లు!

MS Dhoni Retirement: భారత క్రికెట్ చరిత్రలోనే ఒక రియల్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే. రాంచీకి చెందిన ఒక ఆర్డినరీ కుర్రాడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన తీరు ఒక బ్లాక్‌బస్టర్ సినిమాను తలపిస్తుంది. ఈ దిగ్గజ ప్లేయర్ లైఫ్ స్క్రిప్ట్‌లో విధి రాసిన ఒక బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ ఉంది. ధోనీ ఇంటర్నేషనల్ కెరీర్ ఏ విచిత్రమైన రనౌట్ తో ప్రారంభమైందో.. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే రనౌట్‌తో ముగిసిపోయింది. ఆ రెండు క్షణాల మధ్య ధోనీ సృష్టించిన హిస్టరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సిందే.  

వరస్ట్ స్టార్ట్.. కిరాక్ కమ్‌బ్యాక్: 

2004లో బంగ్లాదేశ్‌పై భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ పొడవాటి జుట్టు ఉన్న కుర్రాడికి ఎలాంటి ఎంట్రీ లభించిందో తెలుసా? పక్కా డిజాస్టర్ స్టార్ట్.. ఫస్ట్ మ్యాచ్, ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌కే పరుగు తీసే క్రమంలో రనౌట్ అయి డకౌట్‌గా (0) పెవిలియన్ బాట పట్టాడు. ఈ కుర్రాడేం ఆడతాడులే అని చాలామంది తేలికగా తీసుకున్నారు. కానీ అక్కడ ఉన్నది మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ ఒక్క ఫెయిల్యూర్ తనని ఎంతమాత్రం ఆపలేకపోయింది. ఆ చేదు జ్ఞాపకాన్ని పక్కన పెట్టి, తన హార్డ్ వర్క్‌తో భారత జట్టు తలరాతనే మార్చేశాడు. 

సొంత రూల్స్‌తో ప్రపంచాన్ని శాసించిన కెప్టెన్ కూల్: 

తొలి మ్యాచ్ ఫెయిల్యూర్ తర్వాత ఎంఎస్ ధోనీ చూపించిన కమ్‌బ్యాక్ మామూలుగా లేదు. మైదానంలో ఎంతటి ప్రెజర్ ఉన్నా కూల్ హెడెడ్‌గా ఉంటూ కెప్టెన్ కూల్ బిరుదుని సొంతం చేసుకున్నాడు. వికెట్ వెనుక మెరుపు దాడి లాంటి స్టంపింగ్స్, మ్యాచ్‌ను ఫినిష్ చేసే రాకింగ్ బ్యాటింగ్ శైలితో వరల్డ్ బెస్ట్ ఫినిషర్‌గా అవతరించాడు. 

* 2007 టీ20 వరల్డ్ కప్
* 2011 వన్డే వరల్డ్ కప్
* 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ మూడు ఐసీసీ ప్రధాన ట్రోఫీలను భారత్‌కు అందించి, 3 వేర్వేరు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సృష్టించాడు.

140 కోట్ల మంది గుండెలు పగిలిన క్షణం: 

ఏ సినిమా స్క్రిప్ట్ రైటర్ కూడా రాయలేనంత కన్నీటి క్లైమాక్స్ 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు ధోనీ 50 రన్స్ చేసి పోరాడుతున్నాడు. ఈ మ్యాచ్ విజయం వైపు వెళ్తోంది అనుకునే లోపే.. మార్టిన్ గప్తిల్ విసిరిన ఒక ఊహించని త్రో ధోనీని రనౌట్ చేసింది. ఒక్క అంగుళం దూరంలో ధోనీ క్రీజును అందుకోలేకపోవడం 140 కోట్ల మంది భారతీయుల గుండెలను పిండేసింది. 

ధోనీ రిటైర్మెంట్‌కు ఆరేళ్లు:

భారత క్రికెట్ చరిత్రలో అదొక మరపురాని రోజు.. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఒక శకం ముగిసింది. సరిగ్గా ఆరేళ్ల క్రితం 2020 ఆగస్ట్ 15వ తేదీన రాత్రి 7:29 గంటలకు.. భారత క్రికెట్‌ను శాసించిన మహేంద్ర సింగ్ ధోనీ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, నిశ్శబ్దంగా ధోనీ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతే.. ఆ ఒక్క పోస్ట్‌తో భారత క్రికెట్‌లో ఒక స్వర్ణయుగం ముగిసింది. నాయకత్వానికి కొత్త అర్థం చెప్పిన, ఒత్తిడిలో మ్యాచ్‌లను ముగించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఒక గొప్ప యోధుడు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌ చెప్పి నేటికి సరిగ్గా ఆరేళ్లు అవుతుంది.