టీ20ల్లో శ్రీ చరణి సరికొత్త రికార్డు.. మళ్లీ టాప్-5లోకి స్మృతి మందాన!

టీ20ల్లో శ్రీ చరణి సరికొత్త రికార్డు.. మళ్లీ టాప్-5లోకి స్మృతి మందాన!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20ఐ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి (Shree Charani) సంచలన రికార్డు సృష్టించింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్‌లోనే అత్యధికంగా 817 రేటింగ్ పాయింట్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మెగాన్ షట్ (Megan Schutt) పేరు మీద ఉన్న 806 పాయింట్ల ఆల్-టైమ్ రికార్డును శ్రీ చరణి బ్రేక్ చేసేసింది. 

అదరగొట్టిన చరణి: 

ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్ విజయం సాధించడంలో శ్రీ చరణి కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో మొత్తం 12 వికెట్లు తీసిన ఆమె, శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4/20తో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇక ఆసియా క్రీడలలోనూ తన జోరును కొనసాగించిన చరణి.. జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కేవలం 10 పరుగులే ఇచ్చి 4 వికెట్లు (4/10) పడగొట్టి కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసింది. అంతేకాకుండా శ్రీలంకతో జరిగిన స్వర్ణ పతక పోరులోనూ కీలకమైన 2 వికెట్లు తీసి టీమిండియాకు గోల్డ్ మెడల్ అందించడంలో ప్రధాన భూమిక పోషించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనే ఆమెను ఐసీసీ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ సాధించిన బౌలర్‌గా నిలబెట్టింది.

►ALSO READ | ట్రాక్‌పై దుమ్మురేపిన భారత అమ్మాయిలు.. 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం

టాప్-5లోకి దూసుకొచ్చిన స్మృతి, దీప్తి శర్మ: 

* ఆసియా క్రీడల ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో 79 పరుగులు సాధించిన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి దూసుకొచ్చారు. అంతేకాకుండా ఆమె వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని పదిలపరుచుకున్నారు.

* ఆసియా క్రీడల ఫైనల్‌లో మూడు వికెట్లు తీసిన ఆల్ రౌండర్ దీప్తి శర్మ 754 పాయింట్లతో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోగా, ఇంగ్లాండ్ ఆటగాడు సోఫీ ఎక్లెస్టన్ (723) మూడో స్థానంలో కొనసాగుతుంది.