స్టూడెంట్స్ ఆత్మహత్యలకు చెక్.. సుప్రీంకోర్టు బిగ్ యాక్షన్.. 10 రాష్ట్రాలు, 30 కాలేజీల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్!

స్టూడెంట్స్ ఆత్మహత్యలకు చెక్.. సుప్రీంకోర్టు బిగ్ యాక్షన్.. 10 రాష్ట్రాలు, 30 కాలేజీల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్!

విద్యార్థులపై చదువు ఒత్తిడి, మానసిక ఆందోళనలు, దానికి తోడు ఆత్మహత్యల ఘటనలు ఈ మధ్యకాలంలో మనల్ని ఎంతో కలచివేస్తున్నాయి. భవిష్యత్తును వెతుక్కుంటూ కాలేజీల్లో అడుగుపెడుతున్న యువత.. అక్కడ ఎదురవుతున్న మానసిక సమస్యలతో కుంగిపోవడం దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళనగా మారింది.

ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి, విద్యార్థుల ప్రాణాలను కాపాడటానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. కోర్టు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF) గ్రౌండ్ లెవెల్‌లో విద్యార్థుల కష్టాలను తెలుసుకునేందుకు ఒక పెద్ద క్యాంపైన్ చేపట్టింది.

గత ఏడాది (మే 2025) నుంచి ఇప్పటివరకు ఈ ప్రత్యేక బృందం 10 రాష్ట్రాల్లోని 30 ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలను స్వయంగా సందర్శించింది. కేవలం పైపైన చూసి వెళ్లకుండా, విద్యార్థులు అసలు క్యాంపస్‌లో ఎలాంటి  సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవడానికి పర్యటనలు చేస్తోంది.

క్యాంపస్‌లో అసలేం జరుగుతోంది ?  
విద్యార్థుల చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చడానికి ఈ ప్యానెల్ దాదాపు 25 రకాల విద్యార్థులు సహా యాజమాన్యాలు, నిపుణులతో  ప్రత్యేకంగా చర్చలు జరిపింది. వారు ప్రధానంగా ఫోకస్ చేసిన అంశాలు ఏంటంటే...
*మానసిక ఒత్తిడి & కౌన్సెలింగ్: కాలేజీల్లో విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని ఇచ్చే కౌన్సెలింగ్ సెంటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ?
*వివక్షతో కూడిన వేధింపులు: క్లాస్ రూముల్లో లేదా క్యాంపస్‌లో లింగ వివక్ష, కుల వివక్ష... ముఖ్యంగా ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఎంతవరకు ఉన్నాయి?
*ప్రత్యేక విద్యార్థుల ఇబ్బందులు: శారీరక వైకల్యాలు ఉన్న విద్యార్థులకు కాలేజీలు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి? వాళ్లకు ఎలాంటి అండ లభిస్తోంది?

ఈ సమస్యలను చట్టపరమైన కోణంలో కూడా అర్థం చేసుకోవడానికి, ఈ చర్చల్లో లా (న్యాయశాస్త్ర) విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం విశేషం.

సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ లక్ష్యం ఏంటి?
ఎంతో ఆశతో పిల్లలను కాలేజీలకు పంపే తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వడం, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం.

NTF కీలక బాధ్యతలు:
*విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీస్తున్న అసలు  ప్రధాన కారణాలు ఏంటో గుర్తించడం.
*ప్రస్తుతం కాలేజీల్లో ఉన్న నిబంధనలు, భద్రతా వ్యవస్థలు ఎంతవరకు పని చేస్తున్నాయో రివ్యూ చేయడం.
*యాజమాన్యాల్లో జవాబుదారీతనాన్ని పెంచుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండేందుకు గట్టి సంస్కరణలను, నివారణ చర్యలను సుప్రీంకోర్టుకు సిఫార్సు చేయడం.

చివరగా  చదువుల పేరుతో విద్యార్థుల ప్రాణాలు పోకూడదని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, మానసిక అండ దొరకాలనే తపనతో ఈ కమిటీ పని చేస్తోంది. త్వరలోనే ఈ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపేలా, క్యాంపస్‌లను ఒత్తిడి లేని ప్రదేశాలుగా మార్చేలా ఈ నివేదిక ఉండబోతోంది.