విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టి షాకే ఇచ్చింది. జూలై 1, 2026 నుండి అమల్లోకి వచ్చేలా పాస్‌పోర్ట్ సేవా రుసుములను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా పాత పాస్‌పోర్ట్ రీ-ఇష్యూ ఇకపై అదనపు భారంగా మారింది. మారిన ధరల ప్రకారం సాధారణ, తత్కాల్ కేటగిరీల్లో ఫీజులు భారీగా పెరిగాయి.
సాధారణ కేటగిరీలో దరఖాస్తు చేసుకునే వారికి గతంలో 36 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.1,500 ఉండేది.. ఇప్పుడు అది ఏకంగా రూ.2వేల 500 కు చేరింది. అలాగే తరచూ ప్రయాణాలు చేసేవారికి ఉపయోగపడే 60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.2వేల నుండి ఏకంగా రూ.3వేల 500 కు పెరిగింది. అంటే సాధారణ కేటగిరీలోనే వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక అత్యవసరంగా పాస్‌పోర్ట్ కావాలనుకునే వారి కోసం అందించే తత్కాల్ సేవల ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. జూలై 1 నుండి కొత్త రుసుముల ప్రకారం 36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ పొందాలంటే రూ.5వేలు చెల్లించాలి. అదేవిధంగా 60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ధరను రూ.6వేలుగా నిర్ణయించారు. ఈ పెరిగిన ధరలు కొత్తగా అప్లై చేసేవారికే కాకుండా, పాస్‌పోర్ట్ గడువు ముగిసి రీ-ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
గ్లోబల్ టూరిజం ఊపందుకుంటున్న తరుణంలో పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు సాధారణ ప్రజలపై, ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులపై అదనపు భారాన్ని మోపనుంది. అయినప్పటికీ అంతర్జాతీయ ప్రయాణాలకు పాస్‌పోర్ట్ తప్పనిసరి కాబట్టి.. ఈ జూలై నెల నుండి పెరిగిన రుసుములను చెల్లించి విదేశీ కలలను నిజం చేసుకోవడానికి జనాలు సిద్ధం కాక తప్పదు.
