వాహనదారులకు శుభవార్త.. ఆ బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు

వాహనదారులకు శుభవార్త.. ఆ బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు

మిడిల్‌ఈస్ట్ యుద్ధ మేఘాలు విడిపోవడంతో దేశంలోని వాహనదారులకు భారీ ఊరట లభించింది. ప్రముఖ ప్రైవేట్ ఇంధన రిటైలర్ 'నయారా ఎనర్జీ' బుధవారం(జూలై 1) తెల్లవారుజాము నుంచే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా చల్లబడటంతో.. ఆ లాభాన్ని నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తూ నయారా ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త రేట్ల ప్రకారం.. నయారా బంకుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.5, అలాగే లీటర్ డీజిల్‌పై రూ.3 చొప్పున తగ్గించారు. ఈ తగ్గింపు తర్వాత బెంగళూరులో లీటరు పెట్రోల్ రూ.111.20, డీజిల్ లీటరు రూ.98.80కి చేరింది. అటు మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ రూ.111.66, డీజిల్ రూ.97.99 కాగా.. ఫరీదాబాద్‌లో పెట్రోల్ రూ.103, డీజిల్ రూ.98.84 కి తగ్గాయి. స్థానిక రవాణా ఖర్చులు, వ్యాట్ ఆధారంగా జిల్లాల వారీగా ఈ ధరల్లో కొన్ని పైసల వ్యత్యాసం ఉండనుంది.

గడిచిన మార్చి నెలలో ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచిన నయారా సంస్థ.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ సాధారణ స్థితికి రావడంతో ఆ పెంపును పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర బారెల్‌కు 73 డాలర్లకు పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మీదుగా క్రూడ్ ఆయిల్ సరఫరా పునరుద్ధరణ కావడంతో రిఫైనరీల ఖర్చులు తగ్గాయి. దీంతో ప్రజలకు గతంలో పెంచిన ధరల భారం నుంచి ఉపశమనం ఇవ్వాలని కంపెనీ డిసైడ్ అయ్యింది. 

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 7వేల నయారా బంకుల్లో ఈ తగ్గించబడిన రేట్లు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో నయారా కస్టమర్ల జేబుపై భారం బాగా తగ్గింది. ఉదాహరణకు.. ఒక కారులో 40 లీటర్ల పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయిస్తే రూ.200, అదే పరిమాణంలో డీజిల్ కొట్టిస్తే రూ.120 వరకు వాహన యజమానులకు నేరుగా ఆదా అవుతుంది. నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇది నిజంగా పెద్ద రిలీఫ్.

నయారా సంస్థ రేట్లు తగ్గించడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన IOC, BPCL, HPCL లపై పడింది. ఢిల్లీలో ప్రస్తుతం ఐఓసీ బంకుల్లో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20 గానే ఉంది. ప్రభుత్వ సంస్థలు ఇంకా ధరల తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఇలాగే అదుపులో ఉంటే, ప్రైవేట్ సంస్థల పోటీని తట్టుకోవడానికి ప్రభుత్వ బంకులు కూడా రేట్లు తగ్గించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.