నిఖిల్ మృతి కేసులో సీబీఐ ఎంక్వైరీ షురూ..2022 అక్టోబర్‌‌‌‌ 9న సూర్యాపేటలో ధరావత్ నిఖిల్ మిస్సింగ్‌‌

నిఖిల్ మృతి కేసులో సీబీఐ ఎంక్వైరీ షురూ..2022 అక్టోబర్‌‌‌‌ 9న సూర్యాపేటలో ధరావత్ నిఖిల్ మిస్సింగ్‌‌

12న ఎన్‌‌ఎస్‌‌పీ మేజర్ కెనాల్‌‌లో నిఖిల్‌‌ మృతదేహం లభ్యం
 చిలుకూరు పీఎస్‌‌లో కేసు నమోదు, సీఐడీ దర్యాప్తు
న్యాయం జరగలేదని హైకోర్టును ఆశ్రయించిన నిఖిల్ తల్లిదండ్రులు
సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం, కేసు టేకప్​ చేసిన సీబీఐ

హైదరాబాద్/సూర్యాపేట, వెలుగు: నాలుగేండ్ల కింద జరిగిన సూర్యాపేటకు చెందిన ధరావత్ నిఖిల్(26) అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌(సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర సీఐడీ నుంచి ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌సహా కేసు రికార్డులను సేకరించింది. అగ్రకూలానికి చెందిన  యువతిని ప్రేమించినందునే తమ కుమారుడిని పరువు హత్య చేశారని నిఖిల్‌‌ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

సుదీర్ఘ వాదనల అనంతరం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు హైదరాబాద్‌‌ జోనల్‌‌ సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరో రెండ్రోజుల్లో మృతుడు నిఖిల్‌‌ తల్లిదండ్రుల వాంగ్మూలాలు రికార్డ్‌‌ చేయన్నున్నట్లు తెలిసింది.

2022 అక్టోబర్‌‌‌‌ 9న నిఖిల్ మిస్సింగ్‌‌, 13న డెడ్‌‌బాడీ

సూర్యాపేట జిల్లా కేంద్రానికి  చెందిన మాజీ కౌన్సిలర్ ధరావత్ భాస్కర్ కుమారుడు ధరావత్ నిఖిల్(26) హైదరాబాద్‌‌లో ఎల్‌‌ఎల్‌‌బీ పూర్తి చేశాడు. 2022 అక్టోబర్ 3న దసరా సందర్భంగా సూర్యాపేట వచ్చాడు. అదే నెల 9న స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఆపై తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిలుకూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

పోలీసులు గాలిస్తుండగా మూడ్రోజుల తర్వాత  అదే నెల 12న సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కట్టకొమ్ముగూడెం దగ్గర ఎన్‌‌ఎస్‌‌పీ మేజర్ కెనాల్‌‌లో అనుమానాస్పద స్థితిలో నిఖిల్‌‌ మృతదేహం లభ్యమైంది. నిఖిల్‌‌ శరీరంపై తీవ్ర గాయాలుండడంతో మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ జరిపారు. కాగా, నిఖిల్‌‌ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమంటూ అతని తల్లితండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. సూర్యాపేటకి చెందిన ఒక వ్యాపారి కుమార్తెతో ప్రేమ వ్యవహారంతో పరువు హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన నిఖిల్ తల్లిదండ్రులు

కేసు తీవ్రత నేపథ్యంలో గతంలోనే ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కాగా, స్థానిక పోలీసులు, సీఐడీ దర్యాప్తులో తమకు న్యాయం జరగలేదని నిఖిల్ తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అగ్రకులానికి చెందిన యువతితో ప్రేమ కారణంగా అమ్మాయి కుటుంబం, బంధువులు తమ కుమారుడిని పరువు హత్య చేశారని కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో స్థానిక పోలీసులు, సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

నిఖిల్ మృతి వెనుక గల కారణాలను వెలికి తీసేందుకు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చిలుకూరు పోలీసులు సేకరించిన ఆధారాలతోపాటు సీఐడీ దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించనుంది.