నెల రోజుల శిశువు కిడ్నాప్...లింగపల్లి రైల్వేస్టేషన్లో తల్లి ఒడిలో నుంచి ఎత్తుకెళ్లిన దుండగుడు

నెల రోజుల శిశువు కిడ్నాప్...లింగపల్లి రైల్వేస్టేషన్లో తల్లి ఒడిలో నుంచి ఎత్తుకెళ్లిన దుండగుడు
  •     ఆలస్యంగా వెలుగులోకి ఘటన

చందానగర్, వెలుగు: తల్లి ఒడిలో నిద్రిస్తున్న నెల రోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్​చేసిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి ఏరియాలో సర్కస్​ చేస్తూ జీవనం సాగించే దంపతులు తమ పాపతో కలిసి లింగంపల్లి రైల్వేస్టేషన్​ఫుట్ పాత్​పై నివసిస్తున్నారు. గత నెల 30న రాత్రి తల్లి పాపతో కలిసి ఫుట్​పాత్ పై నిద్రించింది. అర్ధరాత్రి మెలకువ వచ్చి చూసేసరికి శిశువు కనిపించలేదు. 

దంపతులు స్థానికంగా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చందానగర్​ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ పరిశీలించారు. అందులో గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో వచ్చి, పాపను ఎత్తుకెళ్లినట్లు కనిపించింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, శిశువును కిడ్నాప్​చేసిన వ్యక్తి చాంద్రాయణగుట్టలో పిల్లలు లేని దంపతులకు అమ్మేసినట్లు గుర్తించారు. కిడ్నాప్​చేసిన వ్యక్తితోపాటు పాపను కొనుగోలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.