ఇంటి బయట ఉన్న ఈ 91 ఏళ్ల బామ్మ మీదకు కొండముచ్చు ఒక్కసారిగా దూకేసింది.. తర్వాత ఏమైందంటే..

ఇంటి బయట ఉన్న ఈ 91 ఏళ్ల బామ్మ మీదకు కొండముచ్చు ఒక్కసారిగా దూకేసింది.. తర్వాత ఏమైందంటే..

కొప్పల్: కొప్పల్ జిల్లాలోని బి.టి. పాటిల్ నగర్‌లో.. కొండముచ్చు దాడి చేసి తోసివేయడంతో 91 ఏళ్ల వృద్ధురాలు చనిపోయింది. నజమునిసా బేగం అనే వృద్ధురాలు తన ఇంటి బయట నిల్చున్న సమయంలో కొండముచ్చు దాడి చేసింది. కొండముచ్చు అమాంతం ఆమె పైకి దూకడంతో ఆమె కిందపడిపోయింది. తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. గాయాల కారణంగా చికిత్స పొందుతూ చనిపోయింది.

చనిపోయిన వృద్ధురాలు కర్ణాటకలో ప్రముఖ రచయిత ఎం.ఎస్. సవదత్తి భార్య. కొండముచ్చు దాడి చేసిన ఘటన ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. నజమున్నిసాను కాపాడేందుకు ఆమె కూతురు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఆ కొండముచ్చు ఆమెపై కూడా దాడి చేసింది. 

వృద్ధులపై కోతులు, కొండముచ్చుల దాడులు పెరిగిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ 10న అలీగఢ్‌లోని గభానాలో కూడా ఇలానే55 ఏళ్ల వృద్ధురాలిపై కోతుల దాడి చేశాయి. కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో.. ఇంటి మీద నుంచి కిందపడి 55 ఏళ్ల మహిళ చనిపోయింది.

ఆమె దుస్తులు దండెంపై ఆరేయడానికి మేడ మీదకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెను కోతులు చుట్టుముట్టి దాడి చేశాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో కూడా సెప్టెంబర్ 14న ఇలాంటి ఘటనే జరిగింది. కోతులు ఉన్నట్టుండి దాడి చేయడంతో, ఇంటి పై నుంచి కిందపడి ఒక మహిళ మరణించింది. కోతులు, వీధి కుక్కలు ఈ మధ్య జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.