వందకు 40 పైసలు కడితే మీరేం చచ్చిపోరు: UPI ఛార్జీలపై బరితెగింపు కామెంట్స్..!

వందకు 40 పైసలు కడితే మీరేం చచ్చిపోరు: UPI ఛార్జీలపై బరితెగింపు కామెంట్స్..!

దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో సంచలనంగా మారిన UPI చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వ్యవహారం రాజకీయంగా, వ్యాపార వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రూ.2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లహిరి సమర్థించారు. వ్యాపారాలు ప్రభుత్వ సబ్సిడీలపై కాకుండా.. స్వయం సమృద్ధి సాధించే మార్గాలను వెతుక్కోవాలని అన్నారు. ఈ క్రమంలో "పన్ను కడితే మీరేం చచ్చిపోరు" అంటూ ప్రజలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

తత్వవేత్త చాణక్యుడి సూత్రాలను గుర్తుచేస్తూ అశోక్ కుమార్ లహిరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పువ్వు నుంచి తేనెటీగ ఏవిధంగా పూలకు ఎలాంటి హాని కలగకుండా, సున్నితంగా, క్రమక్రమంగా తేనెను సేకరిస్తుందో.. అలాగే పాలకుడు కూడా ప్రజల నుంచి పన్నులను అదే రీతిలో వసూలు చేయాలని చాణక్యుడు చెప్పారంటూ గుర్తుచేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, నీతి ఆయోగ్ అధికారిక వైఖరి కాదని చెప్పారు. 

రూ. 100 లావాదేవీపై కేవలం 40 పైసలు చెల్లించడం వల్ల ఎవరూ చచ్చిపోరని, వ్యాపారాలు ఎప్పుడూ స్వయం సమృద్ధి ప్రాతిపదికనే నడవాలని లహిరి అభిప్రాయపడ్డారు. బ్యాంకులు చెక్ బుక్ ఇచ్చేటప్పుడు చిన్న మొత్తంలో రుసుము వసూలు చేసినట్లుగానే, ఈ ఛార్జీలను కూడా వ్యాపారులు అలవాటు చేసుకుంటారని అన్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత..
అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలకు పైబడిన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుందని, రూ.75వేలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఈ ఛార్జీ గరిష్టంగా రూ.300కు పరిమితం చేయబడుతుందని మోడీ సర్కార్ ప్రకటించింది. అయితే పీపుల్-టు-పీపుల్ చెల్లింపులు, చిన్న వ్యాపారులకు ఈ భారం ఉండదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని ట్రేడర్లు, దుకాణదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి చెల్లింపులో ఇలా కమిషన్ కట్ అయితే దందా నడిపించేది ఎలా అసలే వ్యాపారాలు లేక చస్తోంటే అంటున్నారు వ్యాపారులు. 

ఈ నిర్ణయం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. యూపీఐపై పన్ను విధించడం ద్వారా ప్రధాని మోడీ అమెరికా ముందు సాగిలపడ్డారని.. తక్షణమే ఈ 'యూపీఐ ట్యాక్స్'ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూపీఐ విధాన నిర్ణయాలు భారత్ స్వతంత్రంగా తీసుకున్నవేనని, దీనిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. డబ్బులు ప్రింటింగ్ చేసి దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే ఖర్చు అవ్వట్లేదా.. డిజిటల్ పేరుతో ప్రజలను పిండుకు తినటం దేనికనే వాదన కూడా నెట్టింట గట్టిగా వినిపిస్తోంది.