బండి భగీరథ్‌‌ కు బెయిల్ ఇవ్వొద్దు... హైకోర్టులో పోలీసుల కౌంటర్ దాఖలు

బండి భగీరథ్‌‌ కు బెయిల్ ఇవ్వొద్దు... హైకోర్టులో పోలీసుల కౌంటర్ దాఖలు
  • బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది

హైదరాబాద్, వెలుగు:  పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌‌కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి, వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందని హైకోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పేట్‌‌బషీరాబాద్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ కె. విజయవర్ధన్‌‌ కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కీలక దశలో కొనసాగుతోందని, బెయిలు మంజూరు చేస్తే న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని కౌంటర్‌‌‌‌లో పేర్కొన్నారు. 

బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనంతరం మే 9న బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఆరోపణల తీవ్రత దృష్ట్యా అభియోగాలను సవరిస్తూ మెమో దాఖలు చేశామని తెలిపారు. స్కూల్ రికార్డుల ప్రకారం బాధితురాలి వయస్సు 17 ఏండ్లేనని, ఆమె మైనర్‌‌ అని నిర్ధారించినందున సంబంధిత సెక్షన్‌‌లను ఎఫ్‌‌ఐఆర్‌‌లో చేర్చినట్లు వివరించారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని ఆమెను మానసికంగా ప్రభావితం చేసి, 2025 నుంచి పలుమార్లు శ్రీరామ్‌‌ గార్డెన్స్‌‌లోని ఆమె నివాసంలో, నానక్‌‌రామ్‌‌గూడలోని గోల్ఫ్‌‌ ఎడ్జ్‌‌ అపార్ట్‌‌మెంట్‌‌తో పాటు ఇతర ప్రాంతాల్లో లైంగిక దాడులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని, అందుకే బెయిల్ పిటిషన్‌‌ను తిరస్కరించాలని కోరారు. 

విచారణ 6కు వాయిదా

భగీరథ్ బెయిలు పిటిషన్‌‌పై హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ కె. సుజన శుక్రవారం విచారణ చేపట్టారు. భగీరథ్ 45 రోజులుగా రిమాండ్‌‌లో ఉన్నారని, కోర్టు విధించే అన్ని షరతులను పాటిస్తూ విచారణకు పూర్తిగా సహకరిస్తారని అతడి తరఫు న్యాయవాది వాదించారు. ఫిర్యాదుదారు తరఫున సీనియర్‌‌ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదిస్తూ.. పోలీసులు, మెజిస్ట్రేట్‌‌ నమోదు చేసిన బాధితురాలి వాంగ్మూలం కాపీలను తమకు ఇవ్వాలని కోరారు. పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ నాగేశ్వరరావు స్పందిస్తూ.. ఆ వాంగ్మూలాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించామని, వాటి ప్రతులను ఎవరికీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దీనిపై కౌంటర్‌‌ దాఖలు చేయాలని జడ్జి ఆదేశించగా, సాయంత్రానికల్లా ప్రాసిక్యూషన్‌‌ కౌంటర్‌‌ సమర్పించింది. అనంతరం బెయిలు పిటిషన్‌‌పై తదుపరి విచారణను జడ్జి ఈ నెల 6కు వాయిదా వేశారు.