హైదరాబాద్, వెలుగు: రుణ బకాయిల వసూళ్లలో భాగంగా యూనియన్ బ్యాంకు నిర్వహించిన ఆస్తి వేలం వ్యవహారంలో ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారికి చెందిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తిని సర్ఫేసీ చట్టం ప్రకారం బ్యాంకు వేలం వేయడం చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. వేలం విక్రయాన్ని రద్దు చేస్తూ, విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని యజమానులకు తిరిగి చెల్లించాలని రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ) ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌ల ధర్మాసనం శుక్రవారం రద్దు చేసింది.
శ్రీపరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న రుణం బకాయిల వసూళ్లలో భాగంగా బండ్ల గణేశ్, ఆయన తండ్రి, సోదరుడు తదితరులకు చెందిన ఆస్తిని 2019లో సర్ఫేసీ చట్టం కింద స్వాధీనం చేసుకుని, 2022లో నిర్వహించిన వేలంలో రూ.8.51 కోట్లకు విక్రయించినట్లు బ్యాంకు తరఫు న్యాయవాది బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని రుణ ఖాతాకు జమ చేశామని తెలిపారు. సంబంధిత ఆస్తి కంపెనీది కాకుండా హామీదారుల వ్యక్తిగత ఆస్తి కావడంతో వేలంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని బ్యాంకు తరఫు న్యాయవాదులు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు, రికార్డులను పరిశీలించిన ధర్మాసనం డీఆర్‌టీ తీర్పును రద్దు చేస్తూ యూనియన్ బ్యాంకు నిర్వహించిన వేలాన్ని చెల్లుబాటు అయ్యేదిగా ప్రకటించింది.
