- కేంద్రాన్ని ప్రశ్నించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- బీజేపీ, బీఆర్ఎస్ది సీక్రెట్ సంసారమని ఆరోపణ
- బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు మేం ఇన్స్టాల్మెంట్లు కడుతున్నామని వ్యాఖ్య
కరీంనగర్, వెలుగు: తాము అసెంబ్లీలో తీర్మానం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేయాలని సీబీఐకి కేసు అప్పగిస్తే తొమ్మిది నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ఎవరు.. ఎవరితో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారో, ఎవరు.. ఎవరికి సహకరిస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. కాళేశ్వరం గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు బీజేపీ జాతీయ నాయకులు చాలా సందర్భాల్లో ఏటీఎం అని మాట్లాడారని గుర్తుచేశారు. శుక్రవారం కరీంనగర్‌కు వచ్చిన పీసీసీ చీఫ్.. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడితే హరీశ్ రావు, కేటీఆర్ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.
సొసైటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూ.7.50 లక్షల కోట్లు అప్పులు చేశారని, వారి అప్పులకు నెలకు రూ.6.50 వేల కోట్లు ఇన్స్టాల్మెంట్ వడ్డీ రూపంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటని బండి సంజయ్ అంటున్నారు. పదేండ్లు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎంపీలు అన్ని చట్టాల ఆమోదానికి సహకరించారు. సీక్రెట్ సంసారం చేస్తూ.. బయటికి మాత్రం పడనట్లుగా నటించారు. ఇవాళ కూడా ఒక్కటిగానే ఉన్నారు. రేపు కలిసి పోటీ చేస్తారనే అనుమానం ప్రజల్లో ఉంది’’ అని ఆయన ఆరోపించారు. అభివృద్ధి చేయకుండా మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి ఎప్పటికప్పుడు గెలవాలని ప్రయత్నం చేసే బీజేపీకి రాష్ట్రంలో నూకలు చెల్లవని విమర్శించారు.
