మూడు షిఫ్టుల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

మూడు షిఫ్టుల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
  •     అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశం
  •     ఈ నెల 6న కరీంనగర్ జిల్లాలో హ్యామ్  రోడ్లకు శంకుస్థాపన 
  •     ఆర్ అండ్ బీ శాఖపై అధికారులతో సమీక్ష 

హైదరాబాద్, వెలుగు: వానాకాలం పూర్తి కాగానే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం ప్రారంభించాలని, మొత్తం మూడు షిప్టుల్లో పనులు కొనసాగించాలని అధికారులను ఆర్ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆదేశించారు. ఈ నెల6న కరీంనగర్ జిల్లాలో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సెక్రటరియెట్​లో ఆర్ అండ్ బీ శాఖపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, బాసర, భద్రాచలం ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మొదటి ఫేజ్​లో 6,092 కి.మీ రోడ్ల పనులను రూ.13 వేల కోట్లతో 34 ప్యాకేజీల కింద చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే10 ప్యాకేజీల పనులు ప్రారంభిస్తామన్నారు. 

రాజేంద్రనగర్ లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్స్​ను వచ్చే ఏడాది డిసెంబర్​లోగా పూర్తిచేస్తామని వెల్లడించారు. ఆర్ అండ్ బీ తరఫున నిర్మాణ  బాధ్యతలు చూస్తున్న ఇంజినీర్ల సంఖ్యను పెంచాలన్నారు. ఈ వారం నుంచే తాను ఆకస్మిక తనిఖీలకు వస్తానని,  అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి సిద్ధం అయిందని, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా పని చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఈఎన్సీ జయభారతి, చీఫ్​ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.