- కార్మికుల కష్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదు : ఏఐటీయూసీ నేత రాజ్కుమార్
కోల్బెల్ట్, వెలుగు : కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సింగరేణిని కాపాడుతుంటే మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రం రాజకీయ లబ్ది కోసం సంస్థను వాడుకుంటున్నారని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్జనరల్సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ మండిపడ్డారు. సింగరేణిని రాజకీయ వేదికగా మార్చుకోవద్దని సూచించారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, గణాంకాల అంశంపై మాట్లాడాలనుకుంటే అసెంబ్లీలో మాట్లాడితే.. ప్రభుత్వం సమాధానం చెబుతుందన్నారు.
అవసరమైతే సింగరేణి యాజమాన్యం కూడా అధికారికంగా వివరణ ఇస్తుందన్నారు. కానీ హరీశ్ రావు గనులపైకి వచ్చి పదే పదే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సంస్థను రాజకీయ వివాదాల్లోకి లాగడం వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 7.5 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తి చూపించారని, ఈ విషయంపై అప్పట్లో దాసోజు శ్రావణ్ బహిరంగంగా విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.
అప్పుడు మౌనం వహించిన బీఆర్ఎస్ లీడర్లు, ఇప్పుడు నీతులు చెప్పడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ అవసరాలకు అనుగుణంగా సింగరేణిని రాజకీయ వేదికగా వాడుకోవడం.. బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని ఎద్దేవా చేశారు. సింగరేణి ప్రతిష్టకు భంగం కలిగించే రాజకీయాలను ఎవరు చేసినా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంస్థ పేరును రాజకీయ ప్రచారానికి ఆయుధంగా మార్చే ప్రయత్నాలను బీఆర్ఎస్ లీడర్లు మానుకోవాలని హితవు పలికారు.
