- గతేడాది నీట మునిగిన కాలనీలు
- ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపని అధికారులు
- హై లెవెల్ బ్రిడ్జిలుగా నిర్మాణానికి నోచుకోని లో లెవెల్ బ్రిడ్జిలు
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఖానాపూర్ చెరువు బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణాలు వెలిశాయి. దాదాపు 114 ఎకరాలు ఉండాల్సిన చెరువు కొన్నేండ్లుగా ఆక్రమణలకు గురై చుట్టూ నిర్మాణాలు వెలిశాయి. ఫలితంగా వర్షాలు కురిసినప్పుడు వరద చుట్టుపక్కల కాలనీల్లోకి ప్రవహిస్తోంది. చెరువులోని నీరు బయటకు వెళ్లేందుకు మూడు కాల్వలు ఉండగా అందులో రెండింటిని పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో అవి కనిపించకుండా పోయాయి. ఈ చెరువు ఒక్కటే కాకుండా ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కాలువలు ఆక్రమణలకు గురై ఏటా వర్షాలు కురిసినప్పుడు వరద ఇండ్లలోకి వస్తోంది.
ఆదిలాబాద్, వెలుగు: వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వరద ముప్పు వెంటాడనుందని ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మున్సిపా లిటీ పరిధిలో చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికావడం వల్ల ప్రతి ఏటా వర్షాకాలంలో నీరు పారే దారి లేక కాలనీలు జలమయమవుతున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఆదిలాబాద్ పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే. నాలాల ఆక్రమణలతో పాటు చెరువులు, వాగుల బఫర్ జోన్లో భవన నిర్మాణాలే కారణమని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సర్వేలో తేలింది. దాదాపు 300 ఇండ్లు నీట మునిగాయి.
పట్టణంలోని ధస్నాపూర్ వాగు ధస్నాపూర్, రాంనగర్, సాయినగర్ టీచర్స్ కాలనీ, టేలర్స్ కాలనీ, గ్రీన్ సిటీ, రణదివేనగర్, గాంధీనగర్ మీదుగాప్రవహించి చాందా(టి) వాగులో కలుస్తోంది. ఈ వాగుకు ఇరువైపులా 9 మీటర్ల బఫర్ జోన్ గా నిర్ణయించినప్పటికీ అక్కడ నివాసాలు వెలుస్తున్నాయి. ఫలితంగా భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి సమీపంలోని ఇండ్లలోకి వరద చేరుతోంది. భాగ్యనగర్, తాటిగూడ, తిలక్ నగర్ కాలనీలు నాలాలు ఆక్రమించడంతో వరద ప్రవాహంతో మునిగిపోతున్నాయి. ఖానాపూర్ చెరువు ఆక్రమణలకు గురవుతుండటంతో వర్షపు నీరు ఇండ్లలోకి చేరుతోంది. కుమ్మరికుంట, జీఎస్ ఎస్టేట్, గాంధీనగర్, మహాలక్ష్మీవాడ కాలనీల్లో వరద ముప్పు కనిపిస్తోంది.
శాశ్వత పరిష్కారమెప్పుడో..
చెరువులు, నాలాల ఆక్రమణలతో పాటు బఫర్ జోన్ పరిధిలో నివాసాలు, లోలెవల్ బ్రిడ్జిల కారణంగా వరదలు సంభవించినట్లు గతేడాది గుర్తించారు. కానీ ఇప్పటివరకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేదు. ఆక్రమణలు తొలగించలేదు.. లోలెవల్ బ్రిడ్జిల స్థానంలో హైలెవల్ బ్రిడ్జిలు నిర్మిస్తామన్న ప్రతిపాదనలు అటకెక్కాయి. ముఖ్యంగా సుభాష్ నగర్, దుర్గానగర్ కాలనీలో హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో గతేడాది మొదటి అంతస్తువరకు ఈ ప్రాంతంలో నివాసాలు నీట మునిగాయి. కాగా వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష రూ.5 లక్షల నిధులతో పలు నాలాల పూడికతీత పనులు ప్రారంభించారు. ముఖ్యంగా వార్డులు 3, 5, 6, 11, 12, 13, 21, 22, 23, 14 వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి వాటికి ఆనుకొని ఉన్న నాలాలను శుభ్రం చేస్తున్నారు.
రూ.100 కోట్లు కావాలని నివేదిక ఇచ్చాం
ఆదిలాబాద్ పట్టణంలో డ్రైనేజీలు, రోడ్లు, కల్వర్లు, బ్రిడ్జీల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. దాదాపు రూ.100 కోట్లు నిధులు కావాలని నివేదిక అందజేశాం. సమస్యను ఇటీవల ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి సైతం తీసుకెళ్లాం. ప్రస్తుతం వర్షాలు ప్రారంభం కావడంతో ముందస్తు జాగ్రత్తగా నాలాల పూడికతీత ప్రారంభించాం. వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముంపు వాటిళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.
-బండారి అనూష, మున్సిపల్ చైర్ పర్సన్
