నిర్మల్, వెలుగు : బాసరలోని మహంకాళి గుడిలో చోరీకి పాల్పడిన ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ అలియాస్ రామకృష్ణ గత నెల 22న మహంకాళి ఆలయంలోకి చొరబడి గేటు తాళాలు పగులగొట్టారు.
హుండీని పగులగొట్టి ఇందులో ఉన్న రూ. 16 వేలతో పాటు అమ్మవారి వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ నిందితులను పట్టుకునేందుకు ఆరు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. వీరు నాందేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.
నిందితులు కాచిగూడ నాగర్ సోల్ రైలులో నాందేడ్ వెళ్తున్నారని తెలుసుకున్న పోలీసులు బాసర రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితో పాటు వారికి సహకరించిన మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన కొడమ అనంద్ ను సైతం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.220 కిలోల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టి, ఒక మొబైల్ ను స్వాధీనం చేసు కున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
