- రాష్ట్రంలో 1.84 లక్షల ఎకరాల్లో హెచ్ పీఎస్ విధానంలో పత్తి సాగు
- సాధారణంగా ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి
- హై డెన్సిటీ విధానంలో180 రోజుల నుంచి 150 రోజులకు తగ్గనున్న పంటకాలం
- రైతులకు హెక్టారుకు 15 విత్తన ప్యాకెట్లు ఫ్రీగా పంపిణీ
మంచిర్యాల, వెలుగు : పత్తి సాగులో తక్కువ విస్తీర్ణం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక సాంద్రత సాగు విధానం (హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్-) తీసుకొచ్చింది. ఆసక్తి ఉన్న రైతులకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం) ద్వారా పత్తి విత్తనాలను ఫ్రీగా సప్లై చేస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లోని రైతు వేదికల్లో సీడ్ ప్యాకెట్ల పంపిణీని ప్రారంభించారు. ఈ పత్తి విత్తనాలకు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు తెలిపారు.
రాష్ట్రంలో 1.84 లక్షల ఎకరాల్లో...
ఈ ఏడాది వానాకాలం సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 1.84 లక్షల ఎకరాల్లో హై డెన్సిటీ పత్తి సాగు చేపట్టాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఒక్కో రైతుకు హెక్టార్ కు 15 విత్తన ప్యాకెట్లను ఫ్రీగా అందజేస్తోంది. మొత్తం రూ. 80.94 కోట్ల విలువైన 11.07 లక్షల సీడ్ ప్యాకెట్లకు పంపిణీ చేయనుంది. ఒక రైతుకు ఎంత భూమి ఉన్నా హెక్టారు (రెండున్నర ఎకరాలు)కు మాత్రమే ఈ స్కీమ్ వర్తించనుంది. ఒక్కో ప్యాకెట్ కు రూ.900 చొప్పున రూ.13,500 వరకు రైతులకు లబ్ధి చేకూరుతుంది. అయితే ఇందులో హై డెన్సిటీ పత్తి 39,267 హెక్టార్లతో పాటు క్లోజెస్ స్పేసింగ్ (సీఎస్) 27,540 హెక్టార్లు, ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్ మెంట్ (ఐసీఎం) 7 వేల హెక్టార్లలో సాగు చేయనున్నారు.
ఎకరానికి 25 వేలకు పైగా మొక్కలు
సాధారణ పద్ధతిలో పత్తి సాళ్ల నడుమ 90 నుంచి120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. నేల, పత్తి వెరైటీలను బట్టి ఈ దూరం కొద్దిగా మారుతుంది. హెచ్ పీఎస్ విధానంలో సాళ్ల నడుమ దూరం యథావిధంగా ఉన్నప్పటికీ మొక్కల మధ్య గ్యాప్ ను తగ్గిస్తారు. ఈ విధానంలో ప్రతి 15 సెంటీమీటర్లకు ఒక మొక్కను నాటుకోవాలి. సీఎస్ విధానంలో మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు, ఐసీఎంలో 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. మొక్కల నడుమ గ్యాప్ తగ్గినప్పటికీ సాళ్ల మధ్య దూరం మారకపోవడంతో కలుపుతీయడం, డౌర కొట్టడం, ఎరువులు వేయడం, మందులు చల్లడం వంటి పనులకు ఎటువంటి సమస్య ఉండదు.
ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి
హై డెన్సిటీ విధానంలో సాగు ద్వారా 60 నుంచి 70 శాతం అధిక దిగుబడి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ పద్ధతిలో ఎకరానికి సుమారు 7,500 మొక్కలను నాటడం ద్వారా 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే హై డెన్సిటీ విధానంలో ఎకరానికి 25 వేల నుంచి 30 వేల మొక్కలు నాటుతారు. దీంతో 12 నుంచి 14 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. మొక్కలు తక్కువ ఎత్తు పెరిగి ఒకేసారి పూత, కాత వస్తుంది. 180 రోజుల పంట కాలం 150 నుంచి 160 రోజులకు తగ్గుతుంది. పికింగ్ కూడా ఒక్క విడతలోనే పూర్తవుతుంది. దీంతో సాగు ఖర్చులు గణనీయంగా తగ్గడమే కాకుండా రైతులు వెంటనే రెండో పంట వేసుకోవడానికి వీలువుతుంది. ఇప్పటికే బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పరిధిలో ప్రయోగాత్మకంగా అధిక సాంద్రత పత్తి సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధించారు.
కాటన్ ప్రొడక్టివిటీ మిషన్ కింద విత్తనాలు పంపిణీ
హైదరాబాద్, వెలుగు : పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంపే లక్ష్యంగా సెంట్రల్స్కీమ్ కాటన్ ప్రొడక్టివిటీ మిషన్ 2026ను రాష్ట్రంలోని 19 జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ పథకం అమలులో భాగంగా రైతులకు పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని అగ్రికల్చర్ డైరెక్టర్ఆఫీసులో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, విత్తన సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, అగ్రికల్చర్డైరెక్టర్ గోపి, డిప్యూటీ డైరెక్టర్బి.నరసింహారావు, జాయింట్డైరెక్టర్ ఎస్. బాలు హాజరయ్యారు. అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ పత్తి ఉత్పాదకత మిషన్‌ను 2026 వానాకాలం నుంచి 2030–31 వరకు అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అగ్రికల్చర్ వర్సిటీ ప్రిన్సిపాల్ శ్రీధర్ చౌహన్.. హెచ్‌డీపీఎస్, సీఎస్, ఐసీఎం పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో గతేడాది 1.75 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగైంది. ఈసారి కూడా ఇంచుమించు అదే విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉన్నట్టు వ్యవసాయాధికారులు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక విత్తనాలు నాటడంలో కాస్త ఆలస్యం అవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 80 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. జులై 20 వరకు విత్తుకునే చాన్స్ ఉంది. దీంతో ఈసారి 9,200 ఎకరాల్లో హై డెన్సిటీ పత్తి సాగు చేపట్టనున్నట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ తెలిపారు.
