కొత్త హెల్త్ స్కీమ్‌‌‌‌ను వెంటనే అమలు చేయాలి

కొత్త హెల్త్ స్కీమ్‌‌‌‌ను  వెంటనే అమలు చేయాలి
  •     సీఎస్ సంజయ్ జాజును కోరిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన హెల్త్ స్కీమ్‌‌‌‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎస్‌ సంజయ్ జాజును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల ఆరోగ్య పథకం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. 

కొత్త హెల్త్ స్కీమ్ కోసం గత రెండు నెలలుగా టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్ల వేతనం నుంచి డబ్బులు కట్ చేస్తున్నారని, కానీ ఇప్పటివరకు హెల్త్ కార్డులు మంజూరు చేయలేదని శ్రీపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్డులు లేకపోవడంతో ఉద్యోగులు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎస్‌‌‌‌ను కలిసిన వారిలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి, పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్, పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.