కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం.. కల్వకుర్తిలో ప్రజాపాలన–ప్రగతి నివేదిక’ ముగింపు సభ

కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం..  కల్వకుర్తిలో ప్రజాపాలన–ప్రగతి నివేదిక’ ముగింపు సభ
  •     ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు :  కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్రజాపాలన–ప్రగతి నివేదిక’ ముగింపు సభలో నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. మహనీయుల చైతన్య బస్సు యాత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రహదారులు, సాగునీరు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి పనులు చేపడుతున్నట్లు వివరించారు. 

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రభుత్వ విప్​ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, రాజేశ్​రెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందన్నారు. సభలో కళాకారుడు ఏపూరి సోమన్న ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్ని  కార్యక్రమాన్ని సక్సెస్​ చేశారు.