- ఆందోళనలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా రైతాంగం
- వ్యవసాయ అధికారుల సూచనలతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల చూపు
మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పత్తి సాగుపై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు, మే నెల చివరిలోనే వేసవి దుక్కులను సిద్ధం చేసుకుని పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడకపోవడంతో ఇంతవరకు మొలకలు రాలేదు. దీంతో కొందరు రైతులు రెండో సారి మళ్లీ పత్తి విత్తనాలే విత్తుకునేందుకు సన్నద్ధమవుతుండగా, మరికొందరు పత్తి సాగును వీడీ వ్యవసాయ శాఖ ఆఫీసర్ల సూచనల మేరకు కంది, పెసర పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు.
తగ్గనున్న పత్తి సాగు..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఈ సీజన్లో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా రోహిణి కార్తె ప్రారంభం కాగానే కురిసిన ఒక వర్షానికి ఈ రెండు జిల్లాల్లో రైతులు పెద్ద మొత్తంలో పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఆ తర్వాత మృగశిర కార్తె ప్రారంభమై ఒక దఫా వర్షాలు పడడంతో మిగతా పత్తి రైతులూ విత్తనాలను విత్తుకున్నారు. ఆ తర్వాత 45 రోజులు దాటినా వాన జాడ లేదు. బోరు సౌలత్ ఉన్న రైతుల చేలలో మొలకలు వచ్చినా, వర్షాధారంగా పత్తి విత్తనాలు విత్తుకున్న వారికి మాత్రం నిరాశే మిగిలింది. మొలకలు రాక పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోయారు. ఈ క్రమంలో కొందరు రైతులు పత్తి విత్తనాలను చెరిపేశారు. ప్రత్యామ్నాయం పంటలు వేయడానికి ఆలోచన చేస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆఫీసర్లు సూచనల మేరకు పత్తికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర్లు పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు.
ఖర్చు తక్కువ.. నీరూ తక్కువే..
ఈ వానాకాలం సీజన్లో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కంది, పెసర సాధారణ సాగు విస్తీర్ణం 40 వేల ఎకరాలుగా ఆఫీసర్లు అంచనా వేశారు. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి తగ్గిపోయే అవకాశం ఉండడంతో, ఈ రెండు పంటల సాగు దాదాపు 70 వేల ఎకరాల నుంచి 80 వేల ఎకరాలకు పెరిగే అవకాశం ఉంది. పత్తికంటే ఈ రెండు పంటలకు చాలా తక్కువ నీటి తడులు, తక్కువ పెట్టుబడులు అవసరం.
దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా వీటిని ఎంచుకుంటున్నారు. పత్తి దిగుబడులు చేతికి రావడానికి దాదాపు 180 రోజులు పడుతుండగా, నీరు కూడా ఎక్కువగా అందించాల్సి ఉంటుంది. పురుగు మందులు, ఇతర రసాయనాలు, కూలీలు ఖర్చు కలిపి లక్షల్లో పెట్టుబడులు అవసరం ఉంటుంది. కానీ కంది పంట కేవలం 120 రోజుల నుంచి 150 రోజుల్లో చేతికి వస్తుంది. పూత, కాయ దశలో ఒకటి, రెండు తడుల నీరందిస్తే సరిపోతుంది.
పెసర కేవలం రెండున్నర నెలల్లోనే చేతికొస్తుంది. పూత, గింజ పట్టే సమయంలో రెండు, మూడు తడుల నీటిని అందిస్తే సరిపోతుంది. వర్షాభావ పరిస్థితులను సైతం ఈ రెండు పంటలు తట్టుకుంటాయి. ఈనెలాఖరు వరకు కంది, పెసర విత్తనాలను విత్తుకునే టైం ఉండడంతో, రైతులు ప్రత్యామ్నాయంగా ఈ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు.
కందులు పోసినం
నాకు మూడు ఎకరాల భూమి ఉంది. బోరు సౌలత్ కూడా ఉంది. కానీ ఇంత వరకు వర్షాలు పడ్తలేవు. వరి పెడతామంటే నీరు ఎక్కువ అవసరం అవుతుంది. అందుకే తక్కువ నీరు అవసరం అయ్యే కంది విత్తనాలను పోసుకున్నా. పంటలకు నీటి ఇబ్బందులు వస్తాయని సర్కారోళ్లు కూడా కందులే ఏయమని చెప్పిండ్రు.
- గాళ్ల ఎల్లప్ప, రైతు, కోస్గి, నారాయణపేట జిల్లా-
మొలకలు రాకపోడంతో చెరిపేసిన..
నాకు పది ఎకరాల భూమి ఉంది. రోహిణి కార్తెలో మొత్తం పత్తి పెట్టిన. దాదాపు 35 ప్యాకెట్ల విత్తనాలు అవసరం అయ్యాయి. ఒక ప్యాకెట్‌ను రూ.750 చొప్పున రూ.26,250 ఖర్చు చేసిన. విత్తనాలు విత్తడానికి కూలీలకు మరో రూ.5 వేల వరకు అయ్యింది. తీరా చూస్తే వాన లేదు. నాటిన విత్తనాలకు మొలకలు రాలేదు. భూమిలోనే విత్తనాలు కుళ్లిపోయాయి. చేసేది లేక చేనును చెరిపేసిన.
– అనంతారెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా
