- అపార్ట్ మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణదారులకు ఉపయోగం
- సంస్థ పరిధిలోని 18 సర్కిళ్లలో ఆన్‍లైన్ అప్లికేషన్లకు చాన్స్
- సంస్థ సేవలు స్పీడప్ చేస్తామన్న సీఎండీ వరుణ్ రెడ్డి
వరంగల్, వెలుగు : విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎన్ పీడీసీఎల్ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఒక బిల్డింగ్, కాంప్లెక్స్ లో ఎన్ని కనెక్షన్లు అవసరం అయితే.. అన్నింటికీ వేర్వేరుగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ పీడీసీఎల్ 'సింగిల్ అప్లికేషన్.. మల్టిపుల్ కనెక్షన్ల్' అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకే ఒక్క దరఖాస్తులు ఇచ్చి.. ఎన్ని విద్యుత్ కనెక్షన్లు అయినా తీసుకునేలా చర్యలు చేపట్టింది. ఎన్ పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పాత విధానంతో ఇబ్బందులు
పాత విధానంలో అపార్ట్ మెంట్ ఓనర్లు, డెవలపర్లు, బిల్డర్లు, కమర్షియల్ కాంప్లెక్స్ డెవలపర్లు, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బిల్డింగ్ లలో పదుల సంఖ్యలో ఇండ్లు ఉండే.. విద్యుత్ కనెక్షన్ కోసం ఒక్కో ఇంటికి ఒక్కో అప్లికేషన్ ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త విధానంతో ఈ సమస్య పరిష్కారం కానుంది. అయితే ఈ సేవలను ప్రస్తుతం ఎల్‍టీ కేటగిరి 1, కేటగిరి 2 కు మాత్రమే వర్తించనుంది.
మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. 20 కిలోవాట్ల వరకు డెవలప్‍మెంట్, సర్వీస్ లైన్ చార్జీలు వసూలు చేయనుండగా, 20 కిలోవాట్ల పైగా ఉంటే కేవలం సర్వీస్ లైన్ ఛార్జీలు మాత్రమే వర్తించనున్నాయి. అవసరమైన ట్రాన్స్ ఫార్మర్ ను ఎలాంటి ఖర్చు లేకుండా డిస్కం తరఫునే ఏర్పాటు చేయనున్నారు. అలాగే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‍సీ) రెగ్యులేషన్స్ ప్రకారమే చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు.
అందుబాటులో ఆన్‍లైన్ అప్లికేషన్
టీజీఎన్‍పీడీసీఎల్ సంస్థ తన పరిధిలోని సర్కిళ్లలో మల్టీపుల్ కనెక్షన్ల కోసం ఆన్‍లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే విద్యుత్ సేవల్లో మరింత సహాయం కోసం 1912 నంబర్ గానీ 1800 425 0028 టోల్ ఫ్రీ నంబర్ నుగానీ సంప్రదించాలని అధికారులు సూచించారు.
సంస్థ సేవలు స్పీడప్ చేయడానికే..
ఎన్‍పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో అపార్ట్ మెంట్, కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణదారులకు కనెక్షన్ల విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు గుర్తించాం. సంస్థ సేవలను మరింత స్పీడప్ చేసేందుకే మల్టీపుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎన్‍పీడీసీఎల్ ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేకుండా ఆన్‍లైన్ ద్వారానే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
కర్నాటి వరుణ్‍రెడ్డి, ఎన్‍పీడీసీఎల్ సీఎండీ
