- బట్ట సంచుల్లో విత్తనాలు.. నష్టపోతున్న రైతన్న!?
- గతేడాది నిల్వల కారణంగా ఈసారి సీడ్ ఉత్పత్తిని తగ్గించిన కంపెనీలు..
- ఇదే ఆసరాగా చేసుకుని రంగంలోకి దిగిన ఆర్గనైజర్లు
- ఊరు, పేరు, కంపెనీ లోగో లేని సీడ్ ను రైతులకు అంటగడుతుండ్రు
- ఇప్పటికే 20 వేల ఎకరాలకుపైగా ఫేక్ సీడ్ పంపిణీ!
- ఇప్పటివరకు సీడ్ లెక్క ఇవ్వని కంపెనీలు, ఆర్గనైజర్లు
గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ఏటా పంటల సాగుకు వెన్నుదన్నుగా నిలిచే విత్తన కంపెనీల స్థానంలో ఇప్పుడు కొందరు ఆర్గనైజర్లు ప్రవేశించారు. ఊరు, పేరు, కంపెనీ లోగో వంటి కనీస వివరాలు లేని ‘ఫేక్ సీడ్’ను రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. గతేడాది నిల్వలు ఉన్నాయనే కారణంతో ఈసారి ప్రముఖ సీడ్ కంపెనీలు విత్తన ఉత్పత్తిని తగ్గించాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఆర్గనైజర్లు సొంతంగా నకిలీ దందాను తెరపైకి తెచ్చారు. సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చిన పత్తి విత్తనాలకు సంబంధించి రైతు పండించిన పంటను కొనకపోయినా, ఆ ఆర్గనైజర్లు ఇచ్చిన సీడు పండక పోయినా నిండా మునిగేది మాత్రం రైతులే.
బట్ట సంచిలో సీడ్ విత్తనాలు
సాధారణంగా ప్రముఖ కంపెనీలు అందించే ఫౌండేషన్ విత్తనాలు అత్యంత పకడ్బందీగా ప్యాకింగ్ అయి వస్తాయి. వాటిపై మేల్, ఫిమేల్ విత్తనాల వివరాలతో పాటు కంపెనీ పేరు, రకం స్పష్టంగా ముద్రిస్తారు. కానీ ప్రస్తుత మార్కెట్లో ఆర్గనైజర్లు కేవలం సాధారణ బట్ట సంచులలో విత్తనాలను నింపి, వాటిపై పెన్నుతో ‘ఫౌండేషన్ సీడ్’ అని రాసి రైతులకు విక్రయిస్తుండటం కలకలం రేపుతోంది. ఆ విత్తనాలు ఏ రకానికి చెందినవి? ఎంత దిగుబడి వస్తుంది? అనే ప్రాథమిక సమాచారం కూడా లేకుండానే ఈ అక్రమ విక్రయాలు సాగుతున్నాయి.
పర్మిషన్ లేకుండానే ఆర్గనైజర్ల దందా
విత్తన చట్టం ప్రకారం ఎలాంటి రిజిస్ట్రేషన్లు, అనుమతులు లేకుండానే ఆర్గనైజర్లు తమ ఇల్లీగల్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు. ఈ విత్తనాల ద్వారా రేపు పంట పండకపోయినా, ఒకవేళ పండినా పంటను వారు కొనుగోలు చేయకపోయినా చివరకు నష్టపోయేది రైతేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. పండించిన విత్తనాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు, నాణ్యత ప్రమాణాలు ఎలా లెక్కిస్తారనే స్పష్టత లేదు. ఇప్పటికే గతేడాది పండించిన పంటకు కొన్ని కంపెనీలు నేటికీ బకాయిలు చెల్లించకపోగా, ఇప్పుడు నకిలీ ఆర్గనైజర్లను రైతులు నమ్ముకుంటే మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..
ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ ఇచ్చిన కఠిన ఆదేశాలను సైతం ఈ ఆర్గనైజర్లు బేఖాతరు చేశారు. విత్తనాలు ఇచ్చే ముందే రైతులతో స్పష్టమైన అగ్రిమెంట్ చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించగా, వ్యవసాయ అధికారులు ముగ్గురు లాయర్లతో కలిసి అగ్రిమెంట్ పత్రాలను సిద్ధం చేశారు. కానీ, కంపెనీలు, ఆర్గనైజర్లు ఈ నిబంధనను పూర్తిగా పెడచెవిన పెట్టి, ఎలాంటి ఒప్పందాలు లేకుండానే విత్తనాలు సరఫరా చేసేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఆర్గనైజర్ల ఏకపక్ష వైఖరి కారణంగా జిల్లాలో విత్తన రైతుల భవిష్యత్ఇప్పుడు అంధకారంలో పడింది.
20 వేల ఎకరాల్లో ఇల్లీగల్ దందా
జిల్లాలో ప్రతిఏటా సాధారణంగా 60 వేల నుంచి 70 వేల ఎకరాల్లో విత్తన పత్తి సాగు జరుగుతోంది. కాగా, ఈ ఏడాది కంపెనీలు కేవలం 15 వేల నుంచి 20 వేల ఎకరాలకు మాత్రమే అనుమతులు ఇవ్వగా, దానికి సమాంతరంగా ఆర్గనైజర్లు మరో 20 వేల ఎకరాలకు పైగా ఇల్లీగల్ సీడ్‌ను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో ఏ రైతుకు, ఎంత విస్తీర్ణంలో, ఏ కంపెనీ విత్తనాలు ఇచ్చారనే పూర్తి వివరాలను మే నెల ఆఖరి నాటికి వ్యవసాయ అధికారులకు సమర్పించాలి. కానీ జూన్ నెల ముగిసినా కంపెనీలు, ఆర్గనైజర్లు ఎలాంటి లెక్కలు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
క్రిమినల్ కేసులు పెడతాం
పర్మిషన్ లేని సీడ్ విత్తనాలు పంపిణీ చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం. రైతులకు నష్టం జరిగితే ఉపేక్షించేది లేదు. ఆర్గనైజర్లకు, రైతులకు అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పినా కొందరు వినలేదు. జిల్లాలో సీడ్ కంపెనీలు ఆర్గనైజర్లు ఇంకా సీడ్ వివరాలు ఇవ్వని మాట వాస్తవమే.ఈ విషయంపై ఇప్పటికే కంపెనీలతో మాట్లాడాం.
- వీరప్ప నాయక్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, గద్వాల
