గండిపేట, వెలుగు: ఓఆర్ఆర్పై నార్సింగి సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వైపు వెళ్తున్న రెండు లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఒక లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు.
నార్సింగి పోలీసులు గ్యాస్ కట్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటికి తీశారు. ప్రమాదానికి గురైన లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో గచ్చిబౌలి–శంషాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు క్రేన్లతో లారీలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
