హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఖాళీగా ఉన్న 19 ఆఫీసర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాష్ట్ర స్థాయి కేడర్‌కు చెందిన ఈ పోస్టులను జనరల్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ హరిత ప్రకటించారు.
అర్హులైన అభ్యర్థులు ఈనెల 7 నుంచి ఆగస్టు 12 వరకు కమిషన్ వెబ్ సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలని, ఎంపికైనవారికి నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 వరకు వేతన శ్రేణి ఉంటుందని వివరించారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
