రూ.431 బిల్లు కట్టకపోతే.. రూ.30 వేలు వడ్డీ వేస్తారా..? హెచ్‌ఎస్‌బీసీ కస్టమర్‌కు షాక్

రూ.431 బిల్లు కట్టకపోతే.. రూ.30 వేలు వడ్డీ వేస్తారా..? హెచ్‌ఎస్‌బీసీ కస్టమర్‌కు షాక్

క్రెడిట్ కార్డులను ఎంతో జాగ్రత్తగా వాడాలని నిపుణులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా బ్యాంకులు వేసే వడ్డీలు చూస్తే గుండే ఆగిపోతుంది. తాజాగా క్రెడిట్ కార్డు బిల్లులో కేవలం రూ.431 తక్కువగా చెల్లించినందుకు ఒక HSBC కస్టమర్‌కు బ్యాంక్ ఏకంగా రూ.30 వేలు అదనపు ఛార్జీలు విధించింది. రెడిట్ యూజర్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రెడిట్ కార్డు యూజర్లు అరే ఏంట్రా ఇది అంటూ షాకేపోతున్నారు. 

ఒక రెడిట్ యూజర్ తన చేదు అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. ఆయన క్రెడిట్ కార్డు మొత్తం బిల్లు రూ.4లక్షల 17వేల 770 వచ్చిందట.. గడువు తేదీలోపు రూ.4లక్షల 17వేల 339 చెల్లించేశాడు కూడా. అయితే మెుత్తం బిల్లులో కేవలం రూ.431 మాత్రమే పెండింగ్ ఉంది. కానీ ఆ చిన్న మొత్తాన్ని సకాలంలో పూర్తిగా చెల్లించనందుకు బ్యాంక్ విధించిన ఛార్జీలు చూసి క్రెడిట్ కార్డు యూజర్ కంగుతిన్నారు. కేవలం రూ.431 బకాయికి బ్యాంక్ ఏకంగా రూ.25వేల 794 ఫైనాన్స్ ఛార్జీలు వేసింది. అంతేకాకుండా ఆ ఛార్జీలపై రూ.4వేల 643 GST కూడా కట్టాలంది. దీంతో జస్ట్ రూ.431 కాస్తా రూ.30వేల 437కి చేరింది.

బ్యాంక్ యాప్ సరిగ్గా చూపకపోవడం వల్లే తాను రూ.431 చెల్లించలేకపోయానని.. అందువల్లే ఈ పొరపాటు జరిగిందని క్రెడిట్ కార్డ్ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నిసార్లు పార్ట్-పేమెంట్‌లు చేసినప్పటికీ.. అసలు ఎంత బకాయి ఉందనే విషయాన్ని యాప్ స్పష్టంగా చూపలేదని వాపోయారు. ఏ చిన్న పెండింగ్ ఉన్నా.. గడువు తేదీలోపు పూర్తి బిల్లు కట్టకపోతే జరిగే నష్టానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. బ్యాంకులు కస్టమర్ల జేబులు ఎలా గుల్లచేస్తున్నాయో ఈ ఛార్జీలు చూస్తే అర్థం అవుతోంది.

క్రెడిట్ కార్డు రూల్స్ ప్రకారం.. గడువు తేదీలోపు ఫుల్ బిల్లు చెల్లించకపోతే కేవలం బకాయి ఉన్న మొత్తంపైనే కాకుండా, తర్వాత చేసే కార్డు పేమెంట్స్ కూడా మొదటి రోజే వడ్డీ పడటం స్టార్ట్ అవుతుంది. కానీ ఈ విషయం చాలా మంది కస్టమర్లకు అవగాహన ఉండదు. సో బిల్లులో చిన్న మొత్తం అన్ పెయిడ్ ఉన్నా అకౌంట్ 'రివాల్వింగ్ క్రెడిట్' కిందకు మారుతుంది. దీనివల్ల వార్షికంగా వడ్డీ రేట్లు 42 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. కేవలం మినిమం డ్యూ చెల్లించడం వల్ల ఆలస్య లేటు ఫీజులు తప్పినప్పటికీ.. భారీ ఎత్తున ఫైనాన్స్ ఛార్జీలు పడి కస్టమర్లు అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది.