ఇంధన ధరలు 2-, 3 నెలల్లో తగ్గొచ్చు!

ఇంధన ధరలు 2-, 3 నెలల్లో తగ్గొచ్చు!
  •     హింట్ ఇచ్చిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి 
  •     పాత స్టాక్‌నే కంపెనీలు ఇంకా ప్రాసెస్ చేస్తున్నాయని వెల్లడి

న్యూఢిల్లీ: గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా.. దేశంలో రేట్లు ఇప్పుడే ఎందుకు తగ్గట్లేదో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి వివరించారు. పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా ఉన్న టైమ్‌లో కొనుగోలు చేసిన ముడి చమురునే కంపెనీలు ఇంకా ప్రాసెస్ చేస్తున్నాయని చెప్పారు. పెరిగిన రేట్ల వల్ల జూన్ 30 వరకు ఆయిల్ కంపెనీలకు రూ. 74,781 కోట్ల లాస్ వచ్చిందన్నారు. రాబోయే 2, -3 నెలల పాటు అంతర్జాతీయంగా ధరల తగ్గుదల ఇలాగే కొనసాగితే, అప్పుడు ఇంధన ధరల తగ్గింపుపై ఆలోచించవచ్చని మంత్రి హింట్ ఇచ్చారు. 

ప్రస్తుతం ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ రేటుకు కొన్న స్టాక్‌నే వాడుతున్నామని, అందుకే ఇప్పుడే రేట్లు తగ్గడం లేదన్నారు. సంక్షోభంలో వేరే దేశాల్లో పెట్రోల్ ధరలు 20% నుంచి 35% పెరిగితే, ఇండియాలో కేవలం 5.58% మాత్రమే పెరిగిందని గుర్తుచేశారు. ఇక ప్రైవేట్ సంస్థ ‘నయారా ఎనర్జీ’ పెట్రోల్ ధర లీటరుకు రూ. 5, డీజిల్ ధర లీటరుకు రూ. 3 తగ్గించడంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. సంక్షోభంలో నయారా రేట్లు పెంచిందని, ఇప్పుడు ఆ పెంపును మాత్రమే వెనక్కి తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ కంపెనీలు అప్పట్లో రేట్లు పెంచలేదు కాబట్టి, నయారా తగ్గింపుతో వాటికి సంబంధం లేదన్నారు. అమెరికా-, ఇరాన్ ఒప్పందం తర్వాత జూన్ రెండో వారంలోనే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయని మంత్రి పేర్కొన్నారు.