ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీ వ్యాపారాల పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. కొత్త వ్యాపార అవకాశాల కోసం నిర్వహించే ఫ్రాంచైజీ ప్రదర్శనల్లో వివిధ సంస్థలు తమ వ్యాపారాన్ని అత్యంత విజయవంతమైనదిగా చూపిస్తూ ఆకర్షణీయమైన ప్రచారం నిర్వహిస్తాయి. విచిత్రమేమిటంటే వీటిని ఏదో కొత్తగా తామే కనుక్కున్నట్టు, స్టార్టప్‌లాగ ఫీలవడం గమనించవచ్చు.
ఇందులో కొత్త రెస్టారెంట్ ప్రారంభం నుంచి మొదలుకొని, ప్రీ-ప్రైమరీ స్కూళ్లు, జిమ్‌లు, ఉద్యోగ రిక్రూట్మెంట్ఏజెన్సీలు, చాయ్ దుకాణాలు, దోశ సెంటర్లు, కాఫీ పాయింట్లు, బిర్యానీ అడ్డాలు వంటి అనేక ఫుడ్ చైన్స్, అదేవిధంగా పెంపుడు జంతువుల ఫుడ్ స్టోర్లు, పెంపుడు కుక్కల గిఫ్ట్ స్టోర్లు, వాటి సంరక్షణ కేంద్రాలు, ప్రముఖ రిటైల్ సంస్థలు, లోకల్ ఆపరేటింగ్ పాయింట్లు, రెడీమేడ్ బట్టల దుకాణాలు, రిటైల్ సేవల రంగంలో శాఖలు, జ్యువెలరీ సెంటర్లు, విదేశాల్లో విద్యా ప్రవేశాలు, వీసాలు ఇప్పించే ఆఫీసులు లాంటివి అన్ని రకాలుగా ఉంటున్నాయి. వీటిల్లో ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్గానీ, సృజనాత్మకతగానీ లేకపోగా, బీటెక్ / ఎంబీఏలు చేసినవాళ్లు వీటిని ఎంచుకోవడం మరొక వింత.
నిజానికి ఈ ఫ్రాంచైజీలకు చదువుతో పనిలేదు. టూ వీలర్ కిరాణాలను కూడా స్టార్టప్‌లు అనుకునే భ్రమలు జనాల్లో కలిగిస్తూ, వందల వందల ఫ్రాంచైజీలు అమ్ముకోవడం ఒక నియంత్రణ లోపించిన వ్యాపారంగా చెప్పవచ్చు. ఫ్రాంచైజీ ప్రదర్శనకు అడ్మిషన్ ఫీజు కనీసం ఒక్కొక్కరికి రూ.2,000 పైన, లాస్ట్ మినిట్ ప్రవేశాలు అయితే రూ.3,000 పైన వసూలు చేసి, హైటెక్స్ హాల్ లాంటివి బుక్ చేసి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకపోవడం ఒక ఎత్తైతే, హాల్‌లో తిరగడానికి స్థలం లేనంతగా టికెట్లు అమ్మడం చేస్తున్నారు.
సొంతంగా ఏదైనా సాధించాలనే లక్ష్యంతో జీవితంలో ఎదగాలనే ఆశయంతో ఎంతోమంది తమ కష్టార్జిత సొమ్మును పెట్టుబడిగా పెట్టేందుకు ఫ్రాంచైజీ ప్రదర్శనలకు వస్తారు. ముఖ్యంగా నిరుద్యోగుల తల్లిదండ్రులు ‘ఏదోవిధంగా మా వాడికి స్వయం ఉపాధి దొరికింది’ అన్న ఆశతో ఈ ఊబిలోకి నెట్టబడుతున్నారు. అనేక సంస్థలు తమ వ్యాపారం ఎంతో లాభదాయకమని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందని చూపించి, వందలాది శాఖలు విజయవంతంగా నడుస్తున్నాయని చెబుతూ ప్రజలను ఆకర్షిస్తాయి. సరైన పరిశీలన చేయకుండా చాలామంది తమ జీవిత పొదుపులను పెట్టుబడిగా పెట్టి చివరికి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.
చట్టపరమైన నియంత్రణలు అవసరం
మేం స్వయంగా ఒక సంస్థ ప్రధాన శాఖను పరిశీలించడానికి వెళ్లినప్పుడు అక్కడ సరైన నిర్వహణ లేకపోవడం, ఉద్యోగులు లేకపోవడం గమనించాం. సంస్థ నిర్వాహకులు కూడా ముందుగా అక్కడ లేకపోవడం, ఫోన్ చేసిన తర్వాత మాత్రమే అక్కడికి రావడం...‘అయ్యో... మీరూ ఫోన్ చేయకుండా వచ్చారే! మీరు ముందుగా చెప్పి రావాల్సింది’ అన్న పరిస్థితులు కనిపించాయి. ఇలాంటి సంస్థలు దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు అందించడం ఆందోళన కలిగించే విషయం. ఇటీవల ఒక రెస్టారెంట్ సంస్థ దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఇస్తామని ప్రచారం చేసి అనేకమందిని ఆకర్షించింది. అయితే, ఫ్రాంచైజీలు ఇచ్చిన ఏడాది కూడా పూర్తికాకముందే ఆ సంస్థ తన ప్రధాన శాఖనే మూసివేసింది.
దీంతో ఆ సంస్థపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టిన ఫ్రాంచైజీదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రధానశాఖే నిలదొక్కుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఇవ్వడం వ్యాపార నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి సంఘటనలు ఫ్రాంచైజీ సంస్థల ఆర్థికస్థితి, వ్యాపార స్థిరత్వాన్ని ముందుగానే పరిశీలించేలా చట్టపరమైన నియంత్రణలు అవసరమని స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల ఫ్రాంచైజీలు ఇవ్వాలంటే ప్రభుత్వం కొన్ని కచ్చితమైన అర్హతలను తప్పనిసరి చేయాలి. కనీసం గత మూడు సంవత్సరాల ఆడిట్ చేసిన లాభనష్టాల ఖాతాలు, ఆదాయపు పన్ను రిటర్నులు, వ్యాపార స్థిరత్వ ఆధారాలను సంబంధిత అధికారులకు సమర్పించిన తర్వాత మాత్రమే ఫ్రాంచైజీలు ఇచ్చేందుకు అనుమతి ఉండాలి.
ఫ్రాంచైజీ సంస్థలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి
ప్రస్తుతం కొన్ని సంస్థలు తమ అసలు వ్యాపారం ద్వారా కాకుండా, కొత్త ఫ్రాంచైజీల నుంచి వసూలు చేసే ఫీజుల ద్వారానే కొనసాగుతున్నాయి. కొత్త ఫ్రాంచైజీలు చేరినంతకాలం వారికి ఆదాయం లభిస్తుంది. కానీ ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తులు మాత్రం దుకాణం అద్దె, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు వంటి భారాన్ని మోయాల్సి వచ్చి తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఫ్రాంచైజీ ఫీజు తీసుకున్న తర్వాత ఆ వ్యాపారం విజయవంతమవుతుందా లేదా అనే బాధ్యతను కొన్ని సంస్థలు పూర్తిగా విస్మరిస్తున్నాయి. ఇది ఒకవిధంగా మల్టీ లెవెల్ నెట్‌వర్కింగ్ లాంటి అనైతిక వ్యాపారంగా ప్రకటించి ప్రజలను అప్రమత్తులను చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఫ్రాంచైజీ సంస్థలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించాలి.
తప్పుడు హామీలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఫ్రాంచైజీలు ఇవ్వడానికి చట్టబద్ధమైన ప్రమాణాలను రూపొందించి, ప్రజల కష్టార్జిత ధనం మోసగాళ్ల చేతుల్లో పడకుండా రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా ఫ్రాంచైజీ ఒప్పందంలో పెట్టుబడిదారులకు సంబంధించిన అన్ని ఆర్థిక ప్రమాదాలు, వ్యాపార వాస్తవ పరిస్థితులు, విజయావకాశాలు పారదర్శకంగా వెల్లడించడం తప్పనిసరి చేయాలి.
క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
తప్పుడు సమాచారం ఇచ్చి పెట్టుబడులు సేకరించే సంస్థలపై భారీ జరిమానాలు, క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాలను మరింత బలోపేతం చేయాలి. ఫ్రాంచైజీ వ్యవస్థ వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడాలిగానీ, అమాయక చిన్న నిరుద్యోగులను, పెట్టుబడిదారులను మోసం చేసే సాధనంగా మారకూడదు. సరైన నియంత్రణ, పారదర్శకత, చట్టపరమైన పర్యవేక్షణ ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రజల కష్టార్జిత ధనాన్ని రక్షించడం ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, సమాజం అందరి ఉమ్మడి బాధ్యత.
అదేవిధంగా నిరుద్యోగులు, వాళ్ల తల్లిదండ్రులు ఏమాత్రం పరిశోధన, వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం? ఈ మోసాల బారినుంచి ప్రజలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత. అయినప్పటికీ ఎవరికివారు తమ కష్టార్జితం ఒక్కరోజులో హరించకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. మోసానికి గురి అయ్యేవాళ్లు దొరికినంతకాలం, మోసం చేసే సంస్థలు కోకొల్లలుగా పుట్టుకొస్తాయి. బిజినెస్ ఫ్రాంచైజీల పేరిట మోసంచేసే ఈ సంస్థలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలి.
- ఎర్రా నాగేంద్రబాబు
రిటైర్డ్ జాయింట్ కలెక్టర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
