మేయర్, మున్సిపల్ చైర్మన్‌ లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు... కీలక బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం..

మేయర్, మున్సిపల్ చైర్మన్‌ లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు... కీలక బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం..

మేయర్, మున్సిపల్ చైర్మెన్ ల ఎంపికకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనములు 4వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. బుధవారం ( ఆగస్టు 19 ) సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి నారాయణ. ప్రస్తుతం మేయర్, మున్సిపల్ చైర్మన్‌లను పరోక్ష విధానంలో ఎన్నుకుంటున్న క్రమంలో ఎన్నికల విధానంలో మార్పు తీసుకువస్తూ ఈ చట్ట సవరణను ప్రతిపాదించింది ప్రభుత్వం.

ఈ సందర్భంగా సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని... అనంతరం 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని.. 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని అన్నారు నారాయణ. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.

ప్రత్యక్ష ఎన్నికలతో అనేక ప్రయోజనాలు

ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు  మంత్రి నారాయణ.

ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు బలమైన ప్రజామోదం ఉంటుందని తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల మేయర్, చైర్మన్‌పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదని అన్నారు.

  • ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్‌లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. 
  • నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది దోహదపడుతుంది.
  • రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుంది.
  • అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం, పనులు వేగవంతం.
  • నగరాలు, పట్టణాల్లో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగాన్ని చురుకుగా ప్రోత్సహించేందుకు మేయర్, మున్సిపల్ చైర్మన్‌కు మరింత అవకాశం ఉంటుంది.
  • ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా మేయర్ లేదా చైర్మన్‌పై రాజకీయ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది.