హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తం :  ఇన్చార్జ్ మంత్రి సీతక్క

హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తం :  ఇన్చార్జ్ మంత్రి సీతక్క

నిజామాబాద్, వెలుగు: శ్రమజీవులందరికీ మేలు చేసేలా కాంగ్రెస్​ ప్రభుత్వం కనీస వేతనాల చట్టాన్ని ప్రకటించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, నిజామాబాద్​ జిల్లా ఇన్​చార్జ్ ​మంత్రి సీతక్క తెలిపారు. అందులో భాగంగా హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నిజామాబాద్​మార్కెట్​కమిటీలో రూ.6.56 కోట్లతో నిర్మించనున్న షెడ్లు, మడిగెలు, సోలార్​ ప్లాంట్​పనులకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్​ఉమారాణితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, మార్కెట్ కమిటీ చైర్మన్​ ముప్ప గంగారెడ్డి, అడిషనల్ కలెక్టర్ వి.భుజంగరావు, మున్సిపల్ కమిషనర్​దిలీప్​ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తండాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నం

మారుమాల గిరిజన తండాలంన్నిటినీ అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. ఇందల్వాయి మండలంలోని రాంపూర్​ తండా నుంచి వెంగల్​పాడ్​తండా వరకు రూ.5.48 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. కేకే తండా నుంచి మెగ్యానాయక్ ​తండా వరకు రూ.2.94 కోట్లతో నిర్మించే రోడ్డు పనులను ప్రారంభించారు. తిర్మన్​పల్లి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్​ జూనియర్ కాలేజీలో నిర్మించిన హాస్టల్, డైనింగ్​హాల్​ను ప్రారంభించారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్ తాహెర్, అగ్రికల్చర్​ కమిషన్ ​సభ్యుడు గడుగు గంగాధర్, ఆర్టీవో రాజేంద్రకుమార్, డీపీవో శ్రీనివాస్​రావు తదితరులు ఉన్నారు.