హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమవుతున్నది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ సంస్థ తయారు చేసిన విక్రమ్1 రాకెట్ తొలి పరీక్షకు రెడీ అవుతున్నది. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 4 మధ్య ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు ఆ సంస్థ వేగంగా సన్నాహాలు చేస్తోంది. ఈ తొలి ప్రయోగానికి ఆ సంస్థ ‘మిషన్ ఆగమన్’ అనే పేరు పెట్టింది. ఏపీ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని లాంచ్‌ప్యాడ్1 నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
రాకెట్ అసెంబ్లీ, వాతావరణ పరిస్థితులు, రేంజ్ క్లియరెన్సులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రయోగం చేపట్టనున్నారు. ఇప్పటికే లాంచ్ ప్యాడ్ వద్దకు విక్రమ్1 రాకెట్‌ను తీసుకెళ్లారు. ఇంజన్ ప్రొపల్షన్, స్టేజీ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ కంట్రోల్, వెహికల్ పెర్ఫార్మెన్స్వంటి అంశాలను తొలి ప్రయోగంలో పరిశీలించనున్నట్టు స్కైరూట్ సంస్థ చెబుతున్నది.
టెస్ట్ ఫ్లైట్ ఫలితాల ఆధారంగా విక్రమ్1 రాకెట్‌ను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నది. కాగా, విక్రమ్1 రాకెట్ ఏడంతస్తుల ఎత్తు ఉంటుంది. ప్రొపల్షన్ వ్యవస్థలను సంస్థ ప్లాంట్‌లోనే అభివృద్ధి చేశారు. ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లను త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు. లో ఎర్త్ ఆర్బిట్‌లోకి 350 కిలోల తేలికపాటి బరువున్న శాటిలైట్లను పంపేలా విక్రమ్1 రాకెట్‌ను రూపొందించారు.
ఇక, తొలి మిషన్‌లో భాగంగా 450 కిలోమీటర్ల ఎత్తులోకి రాకెట్‌ను పంపించనున్నారు. వాస్తవానికి ఇంతకుముందే స్కైరూట్ సంస్థ తన తొలి రాకెట్‌ను నింగిలోకి పంపించింది. ‘విక్రమ్ ఎస్’గా పేరు పెట్టిన ఆ రాకెట్ కేవలం సబ్ ఆర్బిటాల్ లెవెల్‌కు మాత్రమే వెళ్లగలదు. తాజాగా అభివృద్ధి చేసిన విక్రమ్1 మాత్రం కక్ష్యలోకి వెళ్తుంది. మిషన్ ఆగమన్‌లో భాగంగా మనదేశంతోపాటు విదేశాలకు చెందిన పలు పేలోడ్లను కక్ష్యలోకి పంపనున్నారు.
