- ప్రియుడు మరో వ్యక్తితో కలిసి హత్య, ముగ్గురు అరెస్ట్
ములుగు/వెంకటాపూర్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల కింద ములుగు మండలం జాకారం వద్ద జరిగిన హత్య కేసు వివరాలను డీఎస్పీ ఎన్.రవీందర్ మీడియాకు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటకు చెందిన సిరిపంగ నర్సింగరావుకు భార్య శోభారాణి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఆలపెద్ద వెంకటేశ్వర్లుతో శోభారాణికి వివాహేతర సంబంధం ఉండగా, తమకు అడ్డు వస్తున్నాడని భావించిన శోభారాణి గత నెల 25న వెంకటేశ్వర్లు, దుర్గారెడ్డితో కలిసి భర్తను హత్య చేయాలని ప్లాన్ చేశారు. వెంకటేశ్వర్లు ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్న నరసింహారావు డబ్బులు అడిగాడు. ఇదే అదనుగా తనకు ములుగులో డబ్బులు రావాల్సి ఉందని చెప్పిన వెంకటేశ్వర్లు, తనకు పరిచయం ఉన్న దుర్గారెడ్డితో కలిసి హనుమకొండ జిల్లా పెద్ద పెండ్యాల వద్ద పని చేస్తున్న నరసింహారావును కారులో ఎక్కించుకున్నారు. కారులో నిద్రిస్తున్న నరసింహారావు మెడను వైరుతో బిగించి హత్య చేశారు. అనంతరం జాకారం సమీపంలోని మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ పక్కన డెడ్‌బాడీని పడేసి బండరాయితో తలపై మోదారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీఐలు సురేశ్, కుమార్, ఎస్సై చంద్రశేఖర్ పాల్గొన్నారు.
