- హైవేపై కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు
- ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు శూన్యం
గుడిహత్నూర్, వెలుగు:ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని నేషనల్ హైవేపై జరుగుతున్న అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్ ప్రణాళికా లోపం, అధికారుల నిర్లక్ష్యం వెరసి నేషనల్ హైవే 44పై మన్నూర్ నుండి గుడిహత్నూర్ బస్టాండ్ వరకు ప్రతిరోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. గుడిహత్నూర్ లో హైవేపై గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వాటిని నివారించేందుకు రూ.23 కోట్లతో రెండేండ్ల క్రితం అండర్పాస్నిర్మాణ పనులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అయితే, మే నెలలో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్.. ట్రాఫిక్ మళ్లించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు.
హైవే పై వెళ్లే ప్రతి వాహనాన్ని ఇరుకైన సింగిల్ సర్వీస్ రోడ్డు డోంగర్గావ్–ఈద్గా గుండా మళ్లించడంతో కిలోమీటరు ప్రయాణానికి గంటకుపైగా సమయం పడుతోంది. ఈ రోడ్డులో జూనియర్ కాలేజ్, హైస్కూల్, పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్ ఉండడంతో విద్యార్థులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్, హైవే అథారిటీ అధికారులు స్పందించి ఈ ప్రత్యామ్నాయ మళ్లింపు చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
