పశ్చిమాసియా సంక్షోభాన్ని అధిగమించాం..సామాన్యుడిపై ఇంధన భారం పడకుండా చూశాం: ప్రధాని మోదీ

పశ్చిమాసియా సంక్షోభాన్ని అధిగమించాం..సామాన్యుడిపై ఇంధన భారం పడకుండా చూశాం: ప్రధాని మోదీ
  •     దేశ తొలి​ గ్రీన్‌‌ఫీల్డ్ పెట్రోకెమికల్ రిఫైనరీ రాజస్తాన్​లో ప్రారంభం

బాలోత్రా(రాజస్తాన్): హార్మూజ్‌‌ జలసంధి మూసివేత వల్ల ఎదురైన ఇంధన సంక్షోభాన్ని భారత్ అత్యంత చాకచక్యంగా అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం రాజస్తాన్‌‌లోని బాలోత్రా జిల్లా పచ్చపద్రలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ -కమ్-పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం రిమోట్ బటన్ నొక్కి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ప్రసంగించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభం కాకముందు భారత్ కేవలం 25 నుంచి 26 దేశాల నుంచి మాత్రమే ముడిచమురును దిగుమతి చేసుకునేదని గుర్తుచేశారు. 

సంక్షోభాన్ని ముందే ఊహించి, తమ ప్రభుత్వం అనుసరించిన అంతర్జాతీయ దౌత్య నీతి కారణంగా నలభైకి పైగా  దేశాల నుంచి చమురు దిగుమతులను విస్తరించగలిగామని చెప్పారు. అమెరికా-–ఇజ్రాయెల్ కూటమితో ఇరాన్ తలపడటంతో అంతర్జాతీయంగా ఇంధనం, ఎరువుల సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడినప్పటికీ, భారత్ తన దీర్ఘకాలిక విధానాల వల్ల వాటిని సమర్థవంతంగా తట్టుకుని నిలబడిందని చెప్పారు. రిఫైనింగ్‌‌ సామర్థ్యంలో భారత్ ప్రస్తుతం నాల్గో అతిపెద్ద దేశంగా అవతరించిందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు.

రూ. 75 వేల కోట్ల భారం ప్రభుత్వంపైనే..

చమురు ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో.. నిరుడు ఏప్రిల్–  జూన్ త్రైమాసికంలో దేశీయ చమురు సంస్థలకు రూ.75 వేల కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లిందని మోదీ వివరించారు. అయినప్పటికీ ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందని, సామాన్యులపై భారం పడకుండా లీటర్ ఇంధనంపై రూ.10 వరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చామని చెప్పారు.